ఇస్రో శాస్త్రవేత్త హత్య కేసు: కీలక ఆధారాలు లభ్యం

2 Oct, 2019 19:14 IST|Sakshi
ఏసీపీ తిరుపతన్న

సాక్షి, హైదరాబాద్‌ : నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న శాస్త్రవేత్త శ్రీధరణ్‌ సురేష్‌ (56) అమీర్‌పేటలో మంగళవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని హత్య చేసి.. అనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయారు. ప్రాధమిక విచారణలో హత్యగా తేల్చిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. సురేష్‌ కాల్‌ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. కేసును ఛేదించేందుకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు లభించాయని తెలిపారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు.

(చదవండి : అమీర్‌పేట్‌లో శాస్త్రవేత్త దారుణహత్య)

ఆ వ్యక్తితో సురేష్‌కు ఉన్న పర్సనల్‌ రిలేషన్‌షిప్‌ వల్ల హత్య జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని ఏసీపీ పేర్కొన్నారు. సురేష్‌ కాల్‌డేటా, హత్యకు ముందు వాసవినగర్‌ కాలనీలో లభించిన సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టామని తెలిపారు. సురేష్‌ తలకు గాయమైనట్లు ప్రైమరీ మెడికల్‌ హెల్త్‌ రిపోర్ట్‌లో తేలిందన్నారు. పూర్తిస్థాయి రిపోర్ట్‌ వస్తే నిజనిజాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన అసలు నిందితులను కచ్చితంగా పట్టుకొని తీరుతామని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం అన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు. 

మరిన్ని వార్తలు