కాలుతున్న ఇనుప సూదితో గొంతు, తలపై..

15 Jun, 2018 20:37 IST|Sakshi
జిల్లా వైద్యాధికారి ఎస్‌ఎల్‌ నినమ

జైపూర్‌ : మూడనమ్మకాలకు తలఒగ్గి 10నెలల పసిబిడ్డ తలపై, గొంతుపై ఎర్రగా కాలిన ఇనుప సూదితో కాల్చారు కసాయి తల్లిదండ్రులు. పిల్లాడు నొప్పితో కేకలు పెడుతున్నా వదిలిపెట్టకుండా విచక్షణా రహితంగా వాతలు పెట్టారు. ఈ సంఘటన గురువారం రాజస్థాన్‌లోని బాన్స్‌వారా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే.. బాన్స్‌వారా జిల్లాలోని తేజ్‌పుర్‌ గ్రామానికి చెందిన నందలాల్‌కు దేవ్లా(10నెలలు)అనే కుమారుడు ఉన్నాడు. దేవ్లా గత పదిరోజులుగా అస్వస్థతకు గురై బాధపడుతున్నాడు. ఎవరికి చూపించినా ఆరోగ్యం కుదుట పడకపోవటంతో మూడనమ్మకాల వలలో చిక్కుకున్నారు. భూపేంద్ర బజార్‌లోని ఓ వీధిలో చెత్తతో మంట వేసి అందులో ఇనుప సూదిని బాగా కాల్చారు. ఎర్రగా కాలుతున్న సూదితో దేవ్లా గొంతు, తలపై విచక్షణా రహితంగా వాతలు పెట్టారు. పసి పిల్లాడు నొప్పితో విలవిల్లాడుతున్నా వదిలి పెట్టలేదు.

వాతలు పెట్టినప్పటికి రోగం నయం కాకపోగా.. పిల్లాడి పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో చేసేదేమి లేక దగ్గరలోని ఉదయ్‌పూర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తలకు, గొంతుకు బలమైన గాయాలు కావటంతో పిల్లాడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారి ఎస్‌ఎల్‌ నినమ స్పందిస్తూ.. రాజస్థాన్‌ ప్రభుత్వం ఏటా పెద్ద మొత్తంలో ప్రజల ఆరోగ్యంపై ఖర్చు చేస్తోందన్నారు. కానీ కొన్ని గిరిజన ప్రాంతాల్లో మూడనమ్మకాలు ఇంకా మనుగడలో ఉన్నాయన్నారు. గిరిజన ప్రజలు తెలిసితెలియక మూడనమ్మకాల భారిన పడి పిల్లల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని పేర్కొన్నారు. చదువులేక పోవటం కారణంగా చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. 

మరిన్ని వార్తలు