కన్న పేగునే కాల్చేశారు

13 Nov, 2019 05:27 IST|Sakshi

కొడుకును తాళ్లతో కట్టేసి..నిప్పంటించిన తల్లిదండ్రులు

దామెర: మద్యానికి బానిసై ఇంట్లో గొడవలకు కారణమవుతున్న ఓ కొడుకును తల్లిదండ్రులే కడతేర్చారు. ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడారి ప్రభాకర్, విమల దంపతుల పెద్ద కుమారుడు మహేష్‌ చంద్ర (42). మహేష్‌ భార్య రాధికను డబ్బుల కోసం వేధిస్తుండటం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఆమె ఇటీవల పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మహేష్‌ మద్యానికి బానిసయ్యాడు. దీంతో నిత్యం ఇంట్లో తల్లిదండ్రులతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళ వారం రాత్రి మహేష్‌ మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు మహేష్‌ను ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. స్థానికులు మంటలను ఆర్పి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే సజీవ దహనమయ్యాడు. పరకాల ఏసీపీ శ్రీనివాస్, శాయంపేట సీఐ ఎస్‌.వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఐ యు.భాస్కర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులుగా భావిస్తున్న కడారి ప్రభాకర్, విమలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా