బంగారు తల్లి భారమా...!

6 Jan, 2019 11:54 IST|Sakshi
సునిత దంపతులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్న పోలీసులు, సూపర్‌వైజర్‌ 

ఆడపిల్లను వదిలించుకున్న గిరిజన దంపతులు

తిరుమలగిరి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి ..

సాక్షి, తిరుమలగిరి(నాగార్జునసాగర్‌) : గిరిజన దంపతులు రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో ఇతరులకు విక్రయించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం సుంకిశాలతండాలో శనివారం వెలుగులోకి  వచ్చింది. తండాకు చెందిన రమావత్‌ బాలు, సునిత దంపతులకు మొదటి కాన్పులో ఆడబిడ్డ జన్మించింది. వారసుడి కోసం రెండో దఫా గర్భం దాల్చింది. అక్టోబర్‌ 17వ తేదీన హాలియాలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో రెండో కాన్పులోనూ ఆడబిడ్డకు జన్మనివ్వడంతో పాపను తాము సాకలేమని ఇతరులకు అమ్మేశారు.

కొన్ని రోజులనుంచి సునిత వద్ద పాప కని పించకపోవడంతో అంగన్‌వాడీ కార్యకర్తకు అనుమానం వచ్చి డిసెంబర్‌ 27న సూపర్‌వైజర్‌ నాగమణికి సమాచారం చేరవేసింది. నాగమణి తండా కు చేరుకొని ఆరా తీయగా పసికందును అమ్మిన ట్లు తెలిసింది. అమ్మిన పసికందును ఐదు రోజు ల్లో తీసుకురావాలని, లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది. అయినా శిశువు తల్లి ఒడికి చేరకపోవడంతో శనివారం నాగమణి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాలు, సునిత దంపతులపై ఫిర్యా దు చేసింది. ఏఎస్‌ఐ, సూపర్‌ వైజర్‌ తండాకు చేరుకున్నారు. బాలు సునిత దంపతులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. పాప ఎక్కడున్నా మరో ఐదు రోజుల్లో తండాకు తీసుకురావాలని, లేనిపక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాపను సాకే ఆర్థిక స్థోమత, ఇష్టం లేకపోతే ఆరు నెలల వరకు సాకి తరువాత శిశుగృహకు అప్పగించవచ్చని తెలిపారు.  

అవగాహన కల్పించినా.. మారని తీరు
ప్రభుత్వ పథకాలపై అధికారులు తండాల్లో అవగాహన కల్పిస్తున్నా అది మూణ్నాళ్లముచ్చటగానే మిగిలిపోతోంది. గడిచిన రెండేళ్ల కాలంలో 13మంది దంపతులు ఆడపిలల్లను వదిలించుకున్న ఘటనలే దీనికి నిదర్శనం.గిరిజనులకు ఆడపిల్ల భారం కాకుడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా గిరిపుత్రిక పేరుతో గిరిజన బాలికలకు రూ. లక్ష డిపాజిట్‌ చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం బాలికల సంక్షేమానికి సుకన్యయోజన, ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల చదువుతో పాటు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తుందని అవగాహన కల్పించినా గిరిజనుల్లో మార్పు రాకపోవడం గమనార్హం.  

మరిన్ని వార్తలు