సద్దుమణగని సయ్యద్‌పల్లి

9 Sep, 2019 09:39 IST|Sakshi
గ్రామస్తులతో మాట్లాడుతున్న డీఎస్పీ, ఎమ్మెల్యే తదితరులు (ఫైల్‌)

నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తత

టీఆర్‌ఎస్‌ నాయకుడి కారు తగులబెట్టిన దుండగులు

డీఎస్పీ నుంచి డీఐజీ వరకు ఫిర్యాదులు

కేసు దర్యాప్తులో కనిపించని పురోగతి

ఆందోళనకు సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్‌ నేతలు, బాధితులు

సాక్షి, పరిగి: చిన్నపాటి గొడవలు, అక్కడక్కడ చోటుచేసుకుంటున్న చెదురుమదురు సంఘటనలపై.. దర్యాప్తులో జరుగుతున్న జాప్యం పెద్ద నేరాలకు దారితీస్తోంది. బాధితులు ఫిర్యాదు చేసిన సమయంలో చిన్నపాటి గొడవలుగా భావిస్తున్న పోలీసులు.. పరిస్థితులు చేయి దాటేవరకూ పట్టించుకోవడం లేదు. పోలీసుల డైరీలోని కొన్ని నేరాలను పరిశీలిస్తే ఈ విషయాలు స్పష్టమవుతున్నాయి. ఆరు నెలల క్రితం పరిగి మండలం సల్తాన్‌పూర్‌లో టీఆర్‌ఎస్‌ నేత హత్యకు గురికావడం, దోమ మండంలో జంట హత్యల ఉదంతాలను ప్రజలు ఇంకా మర్చి పోలేదు.. ఈ రెండు ఘటనలు ముందస్తు హెచ్చరికల తర్వాత జరిగినవే. స్థానిక పరిస్థితులను అంచనా వేడయంలో పోలీసులు విఫలం కావడం వల్లే ఈ హత్యలు జరిగాయని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయా గ్రామాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికీ పికెటింగ్‌ కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరో సమస్యాత్మక గ్రామమైన.. పరిగి మండలం సయ్యద్‌పల్లిలో చోటుచేసుకున్న ఘటనలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.  

కారు తగలబెట్టి.. చంపుతామని రాతలు... 
గత జూన్‌ 4వ తేదీ రాత్రి సయ్యద్‌పల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు అప్పటి ఎంపీటీసీ సభ్యురాలి కుమారుడు అయిన తైలం వెంకటయ్య ఇంటి ఎదుట పార్క్‌ చేసిన కారును పెట్రోల్‌ పోసి తగెలబెట్టారు. మరుసటి రోజు స్థానిక ఎమ్మెల్యేతోపాటు డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. కారును తగులబ్టెన ఘటన జరిగిన వారంలోపే అదే టీఆర్‌ఎస్‌ నాయకుడు వెంకటయ్యకు హెచ్చరికలు పంపారు. ఇప్పుడు కారు మాత్రమే తగలబెట్టాం.. త్వరలో వెంకటయ్యను చంపేస్తామంటూ గోడలు, విద్యుత్‌ స్తంభాలు,  శిలాఫలకాలపై పెయింటింగ్‌తో రాశారు.  

మూడు నెలలు దాటినా ..... 
అతి సమస్యాత్మక గ్రామాల జాబితాలో ముందు వరుసలో ఉండే సయ్యద్‌పల్లిలో ఈ ఘటనలు జరిగి సరిగ్గా మూడు నెలలు దాటింది.  బాధితులు, గ్రామస్తులు అనేక సార్లు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను అరెస్టు చేయాలని కోరారు. అనుమానితుల పేర్లను సైతం అందజేశారు. ఎస్‌ఐ, సీఐ మొదలుకుని డీఐజీ, ఐజీల వరకు వెళ్లి విజ్ఞప్తులు చేశారు.  కేసు దర్యాప్తులో  పురోగతి కనిపించకపోవటంతో టీఆర్‌ఎస్‌ నాయకులు, గ్రామస్తులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 

దర్యాప్తు చేస్తున్నాం
సయ్యద్‌పల్లిలో చోటు చేసుకున్న కారు దగ్ధంతో పాట టీఆర్‌ఎస్‌ నాయకుడిని చంపుతామని బెదిరించిన ఘటనలో కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఆధారాలు లేకుండా అరెస్టు చేయలేం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషులను పట్టుకుంటాం.  
– రవీంద్రారెడ్డి, డీఎస్పీ, పరిగి

మరిన్ని వార్తలు