పరిటాల వర్గీయుల బరితెగింపు 

5 Sep, 2019 07:43 IST|Sakshi

వినాయక నిమజ్జనంలో ఘటన

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి 

ఎనిమిదిమందికి గాయాలు 

నసనకోటలో పోలీస్‌ పికెట్‌ 

సాక్షి, అనంతపురం : మాజీ మంత్రి పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోటలో పరిటాల వర్గీయులు బరితెగించారు. వినాయక నిమజ్జనం ముగిసిన తర్వాత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగి వారిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. నసనకోట గ్రామంలో బుధవారం సాయంత్రం వినాయక నిమజ్జనం నిర్వహించారు. నిమజ్జన ఘట్టాన్ని తిలకించేందుకు స్థానికులతో పాటు పక్కనే వెంకటాపురం, గంగంపల్లి గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.  

ఉద్దేశపూర్వకంగానే గొడవ 
నిమజ్జన కార్యక్రమం ముగిసిన అనంతరం గ్రామంలోకి వస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో పరిటాల వర్గీయులు, చుట్టు పక్కల గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో కట్టెలు, రాళ్లతో దాడి చేయడంతో నసనకోట వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకుడు బోయ సూర్యం తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చాకలి నాగభూషణ, నరసింహులు, సావిత్రమ్మ, ముత్యాలప్ప, నరేష్, ప్రతాప్, క్రిష్ణమ్మ గాయపడ్డారు. వీరిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీస్‌పికెట్‌ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.  

మరిన్ని వార్తలు