మారండి... మూసేస్తాం!

22 Feb, 2019 09:15 IST|Sakshi
మాట్లాడుతున్న సీపీ అంజనీ కుమార్‌

రౌడీషీటర్లకు నగర పోలీస్‌ కమిషనర్‌ హామీ

అంబర్‌పేటలో ‘పరివర్తన్‌ సమ్మేళన్‌’

ఈస్ట్‌–నార్త్‌ జోన్లకు సంబంధించి ఏర్పాటు

సాక్షి, సిటీబ్యూరో: ‘ఎవరూ పుట్టుకతో నేరగాళ్లు కాదు. అవసరాలు, పరిస్థితుల ప్రభావంతోనే కొందరు అలా మారతారు’... ఈ విషయాన్ని విశ్వసిస్తున్న నగర పోలీసులు రౌడీషీటర్లకు ఓ గోల్డెన్‌ చాన్స్‌ ఇస్తున్నారు. ఎవరైనా తమ నడవడికను మార్చుకుంటే వారిపై ఉన్న షీట్లను మూసేస్తామంటూ నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌ గురువారం ప్రకటించారు. అంబర్‌పేటలోని పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ‘పరివర్తన్‌ సమ్మేళన్‌’ కార్యక్రమంలో ఆయన ఉత్తర, తూర్పు మండలాలకు చెందిన 180 మంది రౌడీషీటర్లు, పీడీ యాక్ట్‌ కింద జైలుకు వెళ్లి బయటికి వచ్చిన వారిలో సమావేశమయ్యారు. అసాంఘికశక్తులుగా ముద్రపడిన వారిలో మార్పు తీసుకువచ్చేందుకు నగరపోలీస్‌ విభాగం ఈ కార్యక్రమాన్ని  చేపట్టింది. గణేష్‌ ఉత్సవాలు, హనుమాన్‌ జయంతి, బోనాలు... ఇలా నగరంలో ఏ కీలక ఘట్టం జరిగినా పోలీసుల కన్ను ‘షీటర్ల’ పైనే ఉంటుంది. ఆయా సమయాల్లో వారిని స్థానిక ఠాణాలు, టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయాలకు పిలిచి కౌన్సిలింగ్‌ చేయడంతో పాటు మరో పక్క ఆయా ఘట్టాలు సజావుగా సాగేలా సహకరిస్తే షీట్లు ఎత్తివేస్తామని మాట ఇస్తుంటారు.

ఏళ్లుగా ఈ రకంగా ‘షీటర్ల’ను వాడుకుంటున్నా... ఎత్తివేత మాత్రం జరగడం లేదు. దీనిని పరిగణలోకి తీసుకున్న సీపీ దిద్దుబాటు చర్యల ద్వారా రౌడీషీటర్లలో పూర్తి మార్పు తీసుకురావాలని నిర్ణయించారు. అసాంఘికశక్తులను అదుపులో పెట్టడంతో పాటు నేరగాళ్లపై కన్నేసి ఉంచడానికి పోలీసు విభాగం వారిపై వివిధ రకాలైన షీట్లు తెరుస్తుంటారు. బెదిరింపులు, దాడులు తదితరాలు చేసే రౌడీలపై రౌడీషీట్, దొంగతనాలు చేసే చోరులపై సిటీ డోషియర్‌ క్రిమినల్‌ షీట్, ఇబ్బందికర పరిస్థితులను సృష్టించే సమస్యాత్మక వ్యక్తులపై హిస్టరీ షీట్, మత పరమైన నేరాలకు పాల్పడిన వారిపై కమ్యూనల్‌ షీట్, భూ కబ్జాకోరులపై లాండ్‌ గ్రాబర్‌ షీట్‌ తెరుస్తుంటారు. వీటిని వారు నివసించే స్థానిక పోలీసుస్టేషన్లలో నిర్వహించే అధికారులు తరచు ఆయా నేరగాళ్లను పిలిచి కౌన్సిలింగ్‌ చేయడంతో పాటు సున్నిత సమయాల్లో అదుపులోకి తీసుకుని ఆ తరువాత విడిచి పెడుతుంటారు. ఆయా ప్రాంతాల్లో ఏ నేరం, ఘటన చోటు చేసుకున్నా పోలీసుల కన్ను ముందుగా వీరిపైనే పడుతుంది. ఇవే కాకుండా షీటర్లు తరచు టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో అటెండెన్స్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.  పోలీసు మాన్యువల్‌ ప్రకారం రౌడీషీట్లను తెరుస్తారు.

నిర్ణీత కాలంలో రెండు అంతకంటే ఎక్కువ నేరాలు చేసిన, ఉదంతాల్లో పాల్గొన్న వారిపై వీటిని ఓపెన్‌ చేసే అధికారం వారికి ఉంటుంది. మాన్యువల్‌లోని నిబంధనల ప్రకారం ఏటా ఈ షీట్లను పూర్తి స్థాయిలో సమీక్షించాల్సి ఉంటుంది. షీట్‌ తెరిచిన తరవాత ఏడాది పాటు మరో నేరానికి పాల్పడని వారిపై దానిని మూసేసే అవకాశమూ ఉంది. అయితే నగరంలో గడిచిన కొన్నేళ్లుగా ఈ సమీక్ష జరగట్లేదు. ఫలితంగా పరిస్థితుల ప్రభావం, అనుకోకుండా, క్షణికావేశంలో నేరాలు చేసి షీటర్లు మారిన వారిపై ఏళ్ల తరబడి ఇవి కొనసాగుతున్నాయి. దీని ప్రభావం వారి వ్యక్తిగత, సామాజిక జీవితాలపై పడుతోంది. దీనిని పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్‌ రౌడీషీట్లపై సమీక్షించడమేగాక వారికి మారడానికి అవకాశం కల్పిస్తున్నారు.ఈ నేపథ్యంలో ‘పరివర్తన్‌ సమ్మేళన్‌’ పేరుతో వారితో సమావేశాలు  నిర్వహిస్తున్నారు. గురువారం జరిగిన కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సంయుక్త కమిషనర్‌ తరుణ్‌ జోషి, నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగెనవర్, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ, అదనపు డీసీపీలు పి.రాధాకిషన్‌రావు, ఎస్‌.చైతన్యకుమార్‌తో పాటు ఆయా జోన్ల ఏసీపీలు, ఠాణాల ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రవర్తన మార్చుకుంటే రౌడీషీట్లు ఎత్తివేస్తామని వారికి కొత్వాల్‌ హామీ ఇచ్చారు. కొందరు రౌడీషీటర్లతో ముఖాముఖి మాట్లాడారు. ఓ వ్యక్తి 2002లో తాను చేసిన తప్పు కారణంగా రౌడీషీట్‌ తెరిచారని, ఇప్పటి వరకు మరో తప్పు చేయకున్నా అది అలానే ఉందని సీపీ దృష్టికి తెచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఆ షీట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సమీక్షించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.  

మరిన్ని వార్తలు