జనగామలో పార్ధీ గ్యాంగ్‌?

4 May, 2018 08:19 IST|Sakshi
అనుమానిత వ్యక్తి

అర్ధరాత్రి ఓ ఇంట్లో కారంపొడి, ఐరన్‌ రాడ్‌తో హల్‌చల్‌

రెండు గంటలపాటు శ్రమించిన పోలీసులు

స్థానికుల సాయంతో ఓ యువకుడి అరెస్ట్‌

జనగామ : నరహంతక పార్ధీ ముఠా జనగామలో సంచరిస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత ఏడాది రఘునాథపల్లి మండలంలో ఓ కుటుంబంపై విరుచుకుపడి నలుగురిని పొట్టన బెట్టుకున్న పార్ధీ ముఠా సభ్యుల కదలికలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని సాయినగర్‌లో ఓ యువకుడు సృష్టించిన హల్‌చల్‌తో ఒక్కసారిగా హైటెన్షన్‌ నెలకొంది. ఐరన్‌ రాడ్, కారం పొడితో ఏకంగా పోలీసులపై దాడికి పాల్పడే ప్రయత్నం చేయడంతో పార్ధీ ముఠాగా భావిస్తున్నారు. ఓ ఇంట్లోని బాత్‌రూంలో తలదాచుకున్న వ్యక్తిని స్థానికుల సాయంతో పోలీసులు రెండు గంటలపాటు కష్టపడి అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.


జనగామ జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఇంటర్‌సెప్టర్‌ పోలీసుల వాహనం గస్తీ తిరుగుతోంది. హైదరాబాద్‌ హైవే.. ఓవా హోటల్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఐరన్‌ రాడ్‌తో సాయినగర్‌ వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను గమనించిన వ్యక్తి పారిపోతూ సాయినగర్‌లో నివాసముంటున్న మెకానికల్‌ చంద్రయ్య ఇంట్లోకి దూరి, బాత్‌రూంలో తలదాచుకున్నాడు. వెంటనే ఇంటర్‌సెప్టర్‌ పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ ముష్క శ్రీనివాస్, ఎస్సై శ్రీనివాస్‌ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాత్‌™Œరూంలో ఉన్న వ్యక్తి లోపల గడియ పెట్టుకోవడంతో పోలీసులు శతవిధాలుగా ప్రయత్నించారు.

బాత్‌రూం లోపలి నుంచి ఐరన్‌ రాడ్‌తో పోలీసులపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. సీఐ, ఎస్సైలు రెండు కర్రల సాయంతో వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేశారు. రెండు గంటల తర్వాత తలదాచుకున్న వ్యక్తి బయటకు వచ్చి పోలీసుల కళ్లలో కారం చల్లుతూ పారిపోయేందుకు యత్నించాడు. ఈ దాడిలో పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పారిపోతున్న వ్యక్తిని పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.


రైల్వేస్టేషన్‌ ఏరియాల్లో అప్రమత్తం

రైల్వే లైన్‌ ఉన్న ఏరియాలనే దొంగలు ఎంచుకుంటున్నారు. దోచుకున్న సొత్తుతో దొంగలు రైలు ఎక్కుతూ దర్జాగా పారి పోతున్నారు. గతంలో పార్ధీముఠా సభ్యులు రైల్వే స్టేషన్‌ ఉన్న రఘునాథపల్లి మండలంలో దిగి ఓ కుటుంబాన్ని పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు రైల్వే స్టేషన్‌ ఏరియాలో గస్తీ పెంచారు. ఈ సందర్భంగా జనగామ ఏసీపీ బాపురెడ్డి మాట్లాడుతూ తాము అదుపులోకి తీసుకున్న వ్యక్తి పార్ధీ ముఠాకు చెందిన వాడు కాదని, విచారణ  తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.

ఆ ముఠా పనేనా?

పోలీసులకు పట్టుబడిన వ్యక్తి ఒకరేనా లేక గ్యాంగ్‌గా వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వచ్చే ముందు బాత్‌రూం నుంచే హిందీలో మాట్లాడుతూ సిమ్‌కార్డు విరగొట్టాడని స్థానికులు చెబు తున్నారు. ఫోన్‌ చేసింది ఎవరికి.. సిమ్‌ విరగ్గొట్టాల్సిన అవసరం ఏమిటనే అనుమానాలను నివృత్తి చేసుకుంటే.. కచ్చితంగా పార్ధీ ముఠా దిగవచ్చనే ప్రచారం జరుగుతోంది. పట్టుబడిన వ్యక్తి నుంచి పోలీసులు సెల్‌ఫోన్‌తోపాటు అస్సాం రాష్ట్రానికి చెందిన ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు వెళ్లి, అక్కడి నుంచి వరంగల్‌ కమిషనరేట్‌లోని సీసీఎస్‌కు తరలించారు. 

పోలీసుల అదుపులో ఉన్న అస్సాం యువకుడు   

>
మరిన్ని వార్తలు