మిస్టరీ వీడింది.. పాస్‌బుక్‌ పట్టించింది!

15 Oct, 2019 13:01 IST|Sakshi

కోల్‌కతా : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బెంగాల్‌ టీచర్‌ బంధు ప్రకాశ్‌ పాల్‌ కుటుంబం హత్య మిస్టరీ వీడింది. ప్రకాశ్‌ నిర్వహిస్తున్న చిట్‌ వ్యాపారంలో ఖాతాదారుడైన ఉత్పల్‌ బెహరా అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ వార్తలను ఉత్పల్‌ తండ్రి కొట్టిపడేశాడు. తన కుమారుడికి ప్రకాశ్‌తో పరిచయం ఉన్న మాట వాస్తవేమనని.. అయితే ఉత్పల్‌ హత్య చేసేంత దుర్మార్గుడు కాదని పేర్కొన్నాడు. తన కొడుకును కావాలనే కేసులో ఇరికించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ముర్షీదాబాద్‌ జిల్లాకు చెందిన బంధు ప్రకాశ్‌ పాల్‌(35), ఆయన భార్య బ్యూటీ (ప్రస్తుతం గర్భిణి), ఎనిమిదేళ్ల కుమారుడు అంగన్‌ గత మంగళవారం సొంత ఇంట్లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రకాశ్‌ ఆరెస్సెస్‌ కార్యకర్త అని, ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు అతడిని హతమార్చారంటూ విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో మిస్టరీని ఛేదించేందుకు సీఐడీ బృందం రంగంలోకి దిగింది.(చదవండి : తల్లిదండ్రులు, చిన్నారి పాశవిక హత్య)

ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా ప్రకాశ్‌ పాల్‌ నిబంధనలకు విరుద్ధంగా ఓ ‘ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌(చిట్టీల వ్యాపారం)’ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో బడుగు బలహీన వర్గాలకు చెందిన, రోజూవారీ కూలీలే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిలో సాహాపూర్‌కు చెందిన ఉత్పల్‌ బెహరా అనే వ్యక్తి కూడా ఉన్నాడని.. అతడే హత్యకు పాల్పడ్డాడని వెల్లడించారు. ‘ చిట్టీల వ్యాపారంలో బంధుకు ఉత్పల్‌తో విభేదాలు తలెత్తాయి. ఒప్పందం ప్రకారం తనకు రూ. 48 వేలు ఇవ్వాల్సిందిగా బంధును కోరాడు. అయితే బంధు ఇందుకు నిరాకరించాడు. అంతేగాకుండా అతడిని బెదిరించాడు.

దీంతో అతడిపై కోపం పెంచుకున్న ఉత్పల్‌ పథకం ప్రకారం కత్తి వంటి పదునైన ఆయుధంతో బంధు కుటుంబంపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆ సమయంలో ఘటనాస్థలంలో పడిపోయిన అతడి పాస్‌బుక్‌ (స్కీమ్‌కు సంబంధించింది) లభించింది. దీంతో మాకు అతడిపై అనుమానం కలిగింది. ప్రకాశ్‌ ఇరుగుపొరుగు వారిని విచారించగా.. హత్య జరిగిన రోజు ఉత్పల్‌ను చూశామని చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు’ అని సీఐడీ అధికారి వెల్లడించారు.

అదే విధంగా హత్య జరిగిన రోజు ప్రకాశ్‌ ఇంట్లో నుంచి విలువైన వస్తువులు చోరీకి గురైనట్లుగా గుర్తించామన్నారు. కాగా పోలీసులు దురుద్దేశంతోనే తన కొడుకును అరెస్టు చేశారని, చిత్రహింసలకు గురిచేసి నేరం ఒప్పుకొనేలా చేశారని ఉత్పల్‌ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఇక గత కొన్ని రోజులుగా బెంగాల్‌లో క్రైంరేటు పెరుగుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల విషయమై రాష్ట్ర బీజేపీ నాయకత్వం మమత సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు