బిర్యానీలో బల్లి అంటూ మోసం..

23 Jul, 2019 17:54 IST|Sakshi

రైల్వే క్యాంటీన్‌ యజమాని నుంచి డబ్బులు గుంజే యత్నం 

బ్లాక్‌మెయిల్‌ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  

సాక్షి, గుంతకల్లు:  బల్లి పడిని బిర్యానీని ఇచ్చారంటూ రైల్వే క్యాంటీన్‌ నిర్వాహకులను బెంబేలెత్తించి, నగదు దండుకోవాలనుకున్న ఓ ప్రయాణికుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం ఛత్రపతి శివాజీ టర్మినల్‌–కోయంబత్తూరుకు వెళ్లే కుర్లా ఎక్స్‌ప్రెస్‌ గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు చేరుకుంది. అందులో ప్రయాణిస్తున్న సుందర్‌పాల్‌ అనే ప్రయాణికుడు  4వ ప్లాట్‌ఫారంలో ఉన్న మారయ్య రైల్వే క్యాంటీన్‌లో వెజ్‌ బిర్యానీ కొనుగోలు చేశాడు. అనంతరం అందులో బల్లి పడిందంటూ నేరుగా వెళ్లి డిప్యూటీ రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ జార్జ్, కమర్షియల్‌ మేనేజర్‌ అనూక్‌కు ఫిర్యాదు చేశాడు. కంగారు పడ్డ వారు వెంటనే  రైల్వే ఆస్పత్రి వైద్యురాలు భార్గవిని పిలిపించి ప్రాథమిక చికిత్స చేయించారు. అదే సమయంలో రైల్వే అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం వెల్లడైంది.

బాధితుడిగా భావిస్తున్న సుందర్‌పాల్‌ పచ్చి మోసగాడుగా రైల్వే అధికారులు తేలింది. కావాలనే అన్నంలో చచ్చిన బల్లులను కలిపి రైల్వే క్యాంటీన్‌ యజమానుల బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు గుంజేవాడిగా తెలుసుకున్నారు. ఇదే విషయాన్ని డీసీఎం కుమార్‌గౌరవ్, సీటీఐ వై.ప్రసాద్‌ స్పష్టం చేశారు. నాలుగు రోజుల క్రితం జబల్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో ఇలానే సమోసలో బల్లి వేసి నాటకమాడి ఆ కాంట్రాక్టర్‌ నుంచి రూ.30వేలు గుంజినట్లుగా తేలిందన్నారు. తిరిగి గుంతకల్లులోనూ అదే తరహాలో కాంట్రాక్టర్‌ను బెదిరించి రూ. 5 వేలు డిమాండ్‌ చేశాడని, దీనిపై అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసిందని వివరించారు. రైల్వే అధికారులు విచారణలో తాను వేసింది బల్లి కాదని సముద్రపు చేప అంటూ సుందర్‌పాల్‌ ధ్రువీకరించాడు. డబ్బు కోసం నాలుగైదు ప్రదేశాల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు అంగీకరించాడని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు