ఎవరికైనా చెబితే.. నరకానికి పోతావ్‌!

20 Aug, 2018 13:33 IST|Sakshi
పర్లోవపేటలో పాస్టర్‌ జాషువా నిహార్‌ నడుపుతున్న హౌస్‌ ఆఫ్‌ సాల్వేషన్‌ ప్రార్థనా మందిరం ఇదే.(అంతరచిత్రంలో) పాస్టర్‌ తాతపూడి జాషువా నిహార్‌

బాలికపై పాస్టర్‌ అత్యాచారం

పాస్టర్‌ జాషువా నిహార్, సహకరిస్తున్న మహిళ అరెస్టు

‘‘ఇక్కడ జరుగుతున్న విషయాన్ని నువ్వు ఎవరికైనా చెబితే నరకానికి పోతావ్‌’’ అంటూ.. ఆమెకు నిత్యం నరకం చూపించాడు ఆ మతబోధకుడు. అనారోగ్యంతో ఉన్న ఆమెను స్వస్థతపరుస్తాను.. తన వద్దే ఉంచండంటూ.. ఆమె తల్లిదండ్రులను నమ్మబలికిన ఆ కామ పాస్టర్‌ ఆరు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.చివరికి ఆ పాస్టర్‌ వికృత చేష్టలకు విసుగుచెందిన ఆ బాలిక ఎట్టకేలకు తల్లిదండ్రులకు చెప్పడం.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఆ పాస్టర్‌ను, అతడికి సహకరించిన మహిళను అదుపులోకి తీసుకోవడం వంటి సంఘటనలు కాకినాడ నగరంలో చకచకా జరిగిపోయాయి.

తూర్పుగోదావరి, కాకినాడ రూరల్‌: నగరంలోని పర్లోవపేటకు చెందిన 15 ఏళ్ల బాలికపై హౌస్‌ ఆఫ్‌ సాల్వేషన్‌ పేరుతో చర్చి నడుపుతున్న 54 ఏళ్ల పాస్టర్‌ తాతపూడి జాషువా నిహార్‌ ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆరునెలలుగా అత్యాచారం
చర్చికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను నేర్పిస్తానంటూ పర్లోవపేట నుంచి బాలికను రామారావుపేటలోను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఈ కార్యక్రమం దాదాపు ఆరు నెలలుగా జరుగుతోందని బాలిక తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. ‘‘ఎవరికైనా చెబితే నువ్వు నాశనమై నరకానికి పోతావంటూ’’ పాస్టర్‌ బాలికను బెదిరించి తరచూ అత్యాచారానికి పాల్పడేవాడని బాలిక పోలీసులకు వివరించింది. దీనిపై పోలీసులు పాస్టర్‌ తాతపూడి జాషువా నిహార్‌పై పోక్సో యాక్ట్, కిడ్నాప్, రేప్‌ కేసులు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్టు టూటౌన్‌ సీఐ ఉమర్‌ తెలిపారు. ఈ కేసును డీఎస్పీ రవివర్మ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారన్నారు.

ఇదిలా ఉండగా చర్చి పాస్టర్‌కు, బాలిక తండ్రికి మధ్య నెలరోజులుగా గొడవలు జరుగుతున్నాయని, చర్చి జరుగుతున్న సమయంలో పాస్టర్‌పై బాలిక తండ్రి దాడికి యత్నించగా కొందరు విశ్వాసులు అడ్డుకున్నారని స్థానికులు చెబుతున్నారు. తనపై చర్చి పాస్టర్‌తో పాటు మరికొందరు కావాలని కక్షపూరితంగా దాడి చేసి గాయపరిచారని, దీంతో తాను జూలై 21న పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టానని బాలిక తండ్రి వివరిస్తున్నారు. ఏడాదిగా జాషువా నిహార్‌ చర్చికి వెళుతున్నామని, అతడు పిల్లలను ఆసరాగా చేసుకొని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్నారు.

పాస్టర్, ఓ మహిళ అరెస్టు
బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న జాషువా నిహార్‌ను అతనికి సహకరిస్తున్న ఓ మహిళను కూడా టూటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ రవివర్మ ఆదివారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. బాలిక అనారోగ్యంగా ఉండడంతో ఆమె తల్లి ప్రార్థనా మందిరానికి తీసుకు వచ్చేదని, తొందరగా కోలుకునేందుకు అవసరమైన ప్రార్థనలు చేస్తానని పాస్టర్‌ జాషువా నిహార్‌ బాలిక తల్లిని నమ్మబలకడంతో ఆమె బాలికను పాస్టర్‌ ఇంటికి సువార్త కోసం పంపేదని వివరించారు. ఇదే అదనుగా పాస్టర్‌ నిహార్‌ బాలికపై అత్యాచారం చేసేవాడన్నారు. ఈనెల ఏడోతేదీన బాలిక తనపై జరుగుతున్న అత్యాచారాన్ని బయట పెట్టిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి పాస్టర్‌ను అరెస్టు చేశామన్నారు. బాలికను తీసుకెళ్లేందుకు ఉపయోగించిన కారును కూడా సీజ్‌ చేసినట్టు తెలిపారు. ఈ సంఘటనలో పాస్టర్‌కు సహకరించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిపై చర్యలు చేపడతామని డీఎస్పీ రవివర్మ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు