పాస్టర్‌ ముసుగులో దివ్యాంగురాలిపై అఘాయిత్యం

8 May, 2018 03:10 IST|Sakshi
నిందితుడు రాజారావు

     గర్భం దాల్చిన యువతి

     రూ.50 వేలకు రాజీ కుదిర్చిన అధికార పార్టీ నేతలు 

     విషయం బయటకు పొక్కడంతో బెడిసికొట్టిన రాజీ యత్నాలు

జెడ్‌ మేడపాడు (మండపేట): విధి వంచితురాలైన దివ్యాంగురాలిపై పాస్టర్‌ ముసుగులో ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో అధికారపార్టీ నేతల అండతో రాజీకి ప్రయత్నించాడు. విషయం బయటకు పొక్కడంతో స్థానికులు అతడిని  పోలీసులకు అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని జెడ్‌ మేడపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జెడ్‌ మేడపాడుకు చెందిన 22 ఏళ్ల యువతి పుట్టు మూగ కావడంతోపాటు పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు రాంబాబు వద్ద ఉంటోంది. రాంబాబు ఉదయాన్నే రైస్‌ మిల్లులో ఊక మోసేందుకు వెళుతుంటాడు. అతడి భార్య కూలి పనికి వెళుతుంటుంది.

బాధితురాలు ఇంటి వద్దనే ఉంటుంది. ఇదిలా ఉండగా మండలంలోని అర్తమూరుకు చెందిన ఓశెట్టి దుర్గారావు అలియాస్‌ రాజారావు (60) భార్య చనిపోగా 20 ఏళ్ల క్రితమే జెడ్‌ మేడపాడు వచ్చేసి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఇంటింటికీ తిరిగి ఇనుస సామాను సేకరించి అమ్ముతుంటాడు. సాయంత్రం సమయంలో పాస్టర్‌గా చలామణి అవుతూ ఇంటింటికీ వెళ్లి ప్రార్థనలు చేస్తుంటాడు. ఈ క్రమంలో వికలాంగ యువతికి పింఛన్‌ సొమ్ములు ఇప్పించేందుకంటూ ఆమెను రాజారావు తన మోటారు సైకిల్‌పై తీసుకెళుతుండేవాడు. వారం కిందట యువతి తీవ్ర కొడుపునొప్పితో బాధపడుతుండటంతో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా, ఏడు నెలల గర్భంతో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.

ఈ విషయమై  కుటుంబసభ్యులు యువతిని ప్రశ్నించగా రాజారావు తనను తల్లిని చేసినట్టుగా సైగల ద్వారా తెలిపింది. దీనిపై ఆయన్ని నిలదీయడంతో గ్రామంలో అధికార పార్టీకి చెందిన పెద్దలను ఆశ్రయించాడు. పుట్టే బిడ్డను ఆశ్రమంలో చేర్పించడంతోపాటు మూగ యువతికి రూ.50 వేలు చెల్లించాలని పెద్దలు నిర్ణయించినట్టు రాంబాబు, స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని హెచ్చరించారు. ఈ విషయం తెలిసి బాధితురాలి ఇంటికి సోమవారం మీడియా వెళ్లడంతో అసలు విషయం వెలుగుచూసింది. పాస్టర్‌నని చెప్పుకుంటూ తన సోదరిని గర్భవతిని చేశాడంటూ రాంబాబు కన్నీటి పర్యంతమయ్యాడు. అనంతరం స్థానికులు రాజారావు ఇంటికెళ్లి అతడిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. విచారించి తగిన చర్యలు తీసుకుంటామని రూరల్‌ ఎస్‌ఐ శివప్రసాద్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు