భత్కల్‌పై నేడు ఆరోపణలు నమోదు

23 Oct, 2017 08:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమా మసీద్‌ పేలుడు కేసులో పటియాలా హౌజ్‌ కోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉగ్రవాది, ఇండియన్‌ ముజాహిద్దీన్‌ చీఫ్‌ యాసిన్‌ భత్కల్‌పై ఆరోపణలను నమోదు చేయనుంది. భత్కల్‌తోపాటు అతని కుడి భుజంగా చెప్పుకునే అసదుల్లాపై పేరును కూడా జత చేయనుంది.

సెప్టెంబర్‌ 19, 2010లో జమా మసీద్‌ గేట్‌ వద్ద బైక్‌ పై వచ్చిన ఇద్దరు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు తైవాన్‌ జాతీయులు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు మసీద్‌ సమీపంలో ఓ కారులో బాంబు పెట్టి పేలుడు జరిపారు.  ఈ దాడి వెనుక  యాసిన్ భత్కల్ ఉన్నాడన్నది ప్రధాన ఆరోపణ. ఇక ఇదే కేసులో భత్కల్‌తోపాటు.. అసదుల్లా అక్తర్ పై కూడా ఆరోపణలను కోర్టు నమోదు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే సాక్ష్యులను విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకోబోతోంది.

ఈ ఏడాది ఆగష్టు 1న ఈ కేసు విచారణ సందర్భంగా సరైన సాక్ష్యాలు లేకపోవటంతో ముగ్గురిని కోర్టు విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన యాసిన్ భత్కల్‌ పై మొత్తం 10 బాంబు కేసులు నమోదు అయ్యాయి.  2008 ఢిల్లీ, 2010 వారణాసి, బెంగళూరు స్టేడియం ఇలా వరుస పేలుళ్ల వెనుక ప్రధాన నిందితుడిగా ఉండగా, 2006 ముంబై వరుస రైళ్లు పేలుళ్లు, 2012 పుణే పేలుళ్ల కేసులో అనుమానితుడిగా ఉన్నాడు. బెంగళూర్‌లో జన్మించిన భత్కల్‌.. తర్వాత  మోస్ట్ వాంటెడ్‌ టెర్రరిస్ట్ గా తయారవ్వగా... 2013 ఆగష్టు 28న నేపాల్‌ సరిహద్దులో ఎన్‌ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ కోర్టు డిసెంబర్‌ 19, 2016 అతనికి మరణశిక్ష విధించింది.

మరిన్ని వార్తలు