రోగిగా వచ్చి వైద్యుడికి మస్కా

20 Sep, 2019 08:49 IST|Sakshi
నిందితుడు గురు పట్టాభిరామన్‌

వ్యాపారం పేరుతో హృద్రోగ వైద్యుడికి టోకరా

పీఎంకేవై పథకం కింద పనులంటూ భారీగా వసూలు  

రూ.1.4 కోట్లు తీసుకుని మోసం చేసిన ద్వయం

ఇద్దరినీ పట్టుకున్న నగర సీసీఎస్‌ పోలీసులు

సాక్షి,సిటీబ్యూరో: ఆరోగ్యం బాగోక ఆస్పత్రికి వెళితే.. టెస్టులు.. స్కానింగ్‌లు.. ఇంకా ఏవేవో పేరుతో వైద్యులు, ఆస్పత్రులు రోగిని నిండా ముంచుతారని చాలామంది అనుకుంటారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం రోగిగా ఆస్పత్రికి వచ్చి వైద్యుడునే నిండా ముంచేశాడు. ఈ ఉదంతం నగరానికి చెందిన డాక్టర్‌ జీఎన్‌ రావు విషయంలో సీన్‌ రివర్స్‌ అయింది. హృద్రోగిగా వచ్చి, శస్త్రచికిత్స చేయించుకున్న ఓ వ్యక్తి తన స్నేహితుడిని తీసుకువచ్చి పరిచయం చేశాడు. ముగ్గురం కలిసి పశ్చిమ బెంగాల్‌లో వ్యాపారం చేద్దామంటూ వైద్యుడి నుంచి రూ.1.4 కోట్లు కొల్లగొట్టారు. నకిలీ వర్క్‌ ఆర్డర్లు ఇచ్చి మోసం చేయడంతో విషయం నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) వద్దకు చేరింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు గురువారం ఓ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి తెలిపారు.మరో నిందితుడు తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో అతడినికి నోటీసులు జారీ చేశారు.

అసలు కథ ఇదీ..
నగరానికి చెందిన డాక్టర్‌ జి.నాగశయన రావు ఓ ప్రముఖ ఆస్పత్రిలో సీటీ సర్జన్‌గా (హృద్రోగ వైద్యుడు) పనిచేస్తున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన పీతాంబరం ఈయన వద్దకు రోగిగా వచ్చారు. అప్పట్లో డాక్టర్‌ రావు ఇతడికి బైపాస్‌ సర్జరీ చేశారు. పీతాంబరం కుమార్తె కూడా వైద్యురాలు కావడంతో వీరిద్దరి మధ్యా పరిచయం పెరిగి స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు పీతాంబరం తన స్నేహితుడైన నల్లగొండ వాసి గురు పట్టాభిరామన్‌ చామర్తిని డాక్టర్‌ నాగశయనరావుకు పరిచయం చేశారు. ఈ స్నేహితులు ఇద్దరూ కలిసి సదరు డాక్టర్‌ను టోకరా వేయాలని ప్లాన్‌ వేశారు. దీనికోసం ప్రధానమంత్రి కృషి వికాస్‌ యోజన(పీఎంకేవై) పథకం కింద పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ విభాగానికి వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యాపారం చేద్దామంటూ నమ్మబలికారు. పెట్టిన పెట్టుబడిపై ప్రతి నెలా 24 శాతం లాభం చొప్పున కేవలం ఆరు నెలల్లోనే పెట్టుబడికి రెట్టింపు దాటి ఆదాయం వస్తుందని నమ్మించారు. దీనికి ఆకర్షితుడైన వైద్యుడు ఆసక్తి చూపడంతో ముగ్గురూ కలిసి అన్నపూర్ణ ఆగ్రో బయోటెక్‌ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేశారు. తమకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా ఉన్న ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ పరితోష్‌ భట్టాచార్య, డైరెక్టర్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ పిజోష్‌ కాంతి ప్రమాణిక్‌ వర్క్‌ ఆర్డర్లు ఇచ్చారంటూ ఆ ఇద్దరూ నాగశయనరావుకు చెప్పారు. అందుకు ఆధారాలుగా కొన్ని ఫోర్జరీ పత్రాలను సైతం చూపించారు. ఆ ప్రభుత్వ విభాగాలకు సరఫరా చేయడానికి వ్యవసాయ ఉత్పత్తులు సేకరించాల్సి ఉందని చెప్పిన ఈ ద్వయం డాక్టర్‌ను భారీ మొత్తం పట్టుబడిగా కోరింది. దీంతో ఆయన వివిధ దఫాల్లో మొత్తం రూ.1.4 కోట్లు పట్టాభిరామన్‌ ఖాతాల్లోకి బదిలీ చేశారు.

డబ్బు తీసుకుని మోసం..
ఈ మొత్తం స్వాహా చేసిన ఇద్దరూ ఆపై వైద్యుడు ఎంత ప్రయత్నించినా స్పందించలేదు. వీరికోసం నాగశయనరావు దాదాపు ఏడాదిన్నర పాటు ప్రయత్నించినా ఫలితం లేదు. దీంతో ఆయన రెండు నెలల క్రితం సీసీఎస్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఎఫ్‌–డివిజన్‌ ఏసీపీ జి.వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ కె.మనోజ్‌కుమార్‌ ఈ కేసు దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి ప్రధాన నిందితుడైన పట్టాభిరామ్‌ ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. అతడి కదలికపై పూర్తి నిఘా ఉంచిన అధికారులు బుధవారం నగరానికి వచ్చినట్లు గుర్తించారు. వెంటనే దర్యాప్తు అధికారులు వలపన్ని అతడిని అరెస్టు చేశారు. ఇతగాడు ఈ పంథాలో ఇంకా అనేక మందిని మోసం చేసినట్లు అనుమానిస్తున్న సీసీఎస్‌ అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న పీతాంబరం ఆచూకీని దర్యాప్తు అధికారి కనిపెట్టారు. అయితే, అతడు పక్షవాతం కారణంగా తీవ్ర అనారోగ్యానికి లోనైనట్టు తేలింది. దీంతో పీతాంబరాన్నీ నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41–ఏ సెక్షన్‌ కింద నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత అభియోగపత్రాలు దాఖలు చేస్తామని సీసీఎస్‌ పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు