నెహ్రూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి

12 Oct, 2019 09:04 IST|Sakshi

జైపూర్‌: నెహ్రూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాక.. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసినందుకుగాను బాలీవుడ్‌ టీవీ నటి పాయల్‌ రోహత్గి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. గత నెల 21న పాయల్‌ రోహత్గి మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తల్లిదండ్రులతో పాటు ఆయన భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో చర్మేశ్‌ శర్మ అనే ఓ కాంగ్రెస్‌ కార్యకర్త పాయల్‌ రోహత్గి మీద పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ.. ‘పాయల్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ  తండ్రి మోతీ లాల్‌ నెహ్రూతో పాటు ఆయన భార్య, తల్లిని కూడా అవమానిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాక లాల్‌బహుదూర్‌ శాస్త్రి మరణం గురించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. విదేశాలు, మన దేశం గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పర్చుకునేలా ఈ వీడియో ఉంది. పాయల్‌ మాజీ ప్రధానులను అవమానించడమే కాక దేశ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని తెలిపాడు. టీవీ రియాలిటీ షోల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ కొన్ని బాలీవుడ్‌ సినిమాల్లో కూడా నటించింది. 2008లో బిగ్‌బాస్‌ షోలో కూడా పాల్గొన్నది.

మరిన్ని వార్తలు