బందిపోటు ముఠా నాయకుడిపై పీడీ యాక్ట్‌

23 Jun, 2018 08:47 IST|Sakshi
అంజద్‌ ఖ్వాజా అమీన్‌ షేక్‌ 

సాక్షి, సిటీబ్యూరో/దూద్‌బౌలి: పాతబస్తీలోని పేట్లబురుజులో ఉన్న నిథాయిదాస్‌కు చెందిన బంగారు నగల తయారీ కర్మాగారాన్ని కొల్లగొట్టిన మహారాష్ట్రకు చెందిన బందిపోటు ముఠా నాయకుడు అమ్జద్‌ ఖాజా అమీన్‌ షేక్‌పై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తూ కొత్వాల్‌ అంజనీ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలో అతడిపై 17 ఉన్నాయని, ఈ నేర చరిత్రను పరిగణలోకి తీసుకుని పోలీసు కమిషనర్‌ పీడీ యాక్ట్‌ నిర్ణయం తీసుకున్నట్లు చార్మినార్‌ ఏసీపీ బి.అంజయ్య గురువారం తెలిపారు.

ముంబైకి చెందిన ఓ జ్యువెలరీ డిజైనర్‌ తరచూ నిథాయిదాస్‌కు చెందిన కార్ఖానాలకు వచ్చి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన, తాను రూపొందించిన డిజైన్లను చూపించేవాడు. ఈ నేపథ్యంలోనే ఇతడు పేట్లబురుజులోని కార్ఖానాలకు అనేకసార్లు వచ్చాడు.

అక్కడ జరుగుతున్న లావాదేవీలు, సెక్యూరిటీ ఏర్పాట్లు తక్కువగా ఉన్న విషయం గుర్తించిన ఈ విషయాన్ని తన స్నేహితుడైన ముంబైలోని థానే వాసి అమ్జద్‌ ఖాజాకు చెప్పాడు. సదరు కార్ఖానాలో బంగారు నగల్ని ఏ ఇనుప పెట్టెలో దాస్తారనేది ఉప్పందించాడు.

అప్పటికే పలు దోపిడీ, బందిపోటు దొంగతనం తదితర కేసుల్లో నిందితుడిగా ఉన్న అమ్జద్‌ జ్యువెలరీ డిజైనర్‌ ఇచ్చిన సమాచారంతో గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ కార్ఖానాను టార్గెట్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ముంబైలో వివిధ ప్రాంతాలకు చెందిన పాత నేరగాళ్లు, స్నేహితులైన ఏడుగురితో ముఠా కట్టిన అమ్జద్‌ మార్చ్‌ 6న పంజా విసిరి 3.5 కేజీల బంగారు ఆభరణాల బందిపోటు దొంగతనానికి ఒడిగట్టాడు.

నిందితుల కోసం వేటాడిన టాస్క్‌ఫోర్స్, చార్మినార్‌ పోలీసులు అదే నెలలో అమ్జద్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న ఇతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు.

మరిన్ని వార్తలు