‘పీడీ’తో పరార్‌!

24 Nov, 2018 10:47 IST|Sakshi
మన్సూర్‌

గాలించి పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనర్‌ పీడీ యాక్ట్‌ ప్రయోగించడంతో పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో ఐదు నెలలుగా పరారీలో ఉన్న ఘరానా దొంగను ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఓసారి ఈ యాక్ట్‌ కింద ఏడాది జైల్లో ఉన్నా ఇతడిలో మార్పు రాలేదని అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌కు చెందిన మహ్మద్‌ మన్సూర్‌కు కాలా కవ్వా, దేవ వంటి మారుపేర్లూ ఉన్నాయి. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్‌ అయిన అతను కొన్నేళ్లుగా చోరీలు చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. ఇతడిపై 2015 నాటికే 32 కేసులు నమోదయ్యాయి. వీటిలో సెల్‌ఫోన్‌ స్నాచింగ్, అక్రమాయుధాలతో సంచరించడం, సెల్‌ఫోన్స్‌ చోరీ వంటివి ఉన్నాయి.

దీంతో నగర పోలీసులు 2015లో పీడీ యాక్ట్‌ ప్రయోగించి జైలుకు పంపారు. ఏడాది పాటు కటకటాల్లో ఉండి బయటకువచ్చినా ఇతడి వైఖరిలో మార్పు రాలేదు. మళ్లీ పాత పంథానే అనుసరించడంతో గత ఏడాది మరోసారి అరెస్టయ్యాడు. తాజాగా అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, చార్మినార్, మలక్‌పేట ఠాణాల్లో మరో 10 నేరాలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు మరోసారి ఇతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. ఈ ఉత్తర్వులు అతడికి చేరేలోగా బెయిల్‌పై బయటికి వచ్చిన మన్సూర్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇతడి కోసం రంగంలోకి దిగిన ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ నేతృత్వంలో ఎస్సైలు పి.రమేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, గోవిందు స్వామి, సి.వెంకటేష్‌ ముమ్మరంగా గాలించి శుక్రవారం పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం  అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు