వీడిన కిడ్నాప్‌ మిస్టరీ..

4 Oct, 2019 12:01 IST|Sakshi
దాడిలో గాయపడిన షఫీఉద్దీన్‌, కిడ్నాపర్‌ కాలిద్‌ (ఫైల్‌)  

సినీ ఫక్కీలో సాగిన కిడ్నాప్‌ వ్యవహారం

కిడ్నాప్‌ చేసి రూ.అరకోటి డిమాండ్‌ 

నిందితుడు పాలిటెక్నిక్‌ విద్యార్థి

సాక్షి, పెనమలూరు(కృష్ణా) : యనమలకుదురు గ్రామంలో కిడ్నాప్‌ మిస్టరీ వీడింది. సినీ ఫక్కీలో కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెనమలూరు పోలీసులు, సైబర్‌ క్రైమ్‌ పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి నిందితుడి జాడ తెలుసుకుని స్కెచ్‌ వేసి పట్టుకున్నారు. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. యనమలకుదురులో ఉంటున్న మహ్మద్‌ షఫీఉద్దీన్‌ సౌదీ అరేబియాలో ఉండి గత జనవరిలో యనమలకుదురు వచ్చాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే అతను గ్రామంలో ఉంటున్న కాజాబీతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై ఆమె కుమారుడు షేక్‌ కాలిద్, షఫీఉద్దీన్‌కు మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 1వ తేదీ రాత్రి షఫీఉద్దీన్‌ సదరు మహిళ వద్దకు వెళ్లి వస్తుండగా ఆమె కుమారుడు కాలిద్‌ గ్రామంలోని కల్యాణ మండపం వద్ద అటకాయించాడు. షఫీఉద్దీన్‌పై దాడి చేసి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని ఏలూరు వద్ద పొలాల్లోకి తీసుకెళ్లి అక్కడ మళ్లీ దాడి చేశాడు. తనకు రూ.50 లక్షలు కావాలని డిమాండ్‌ చేశాడు. షఫీఉద్దీన్‌ ఫోన్‌తోనే అతని ఇంటికి ఫోన్‌ చేయించాడు. షఫీఉద్దీన్‌ కుమారుడు మిస్బాఉద్దీన్‌ను సొమ్ము తీసుకురమ్మని బెదిరించాడు. ఈలోగా ఏలూరు వద్ద ఉన్న సత్రంపాడు ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.30 వేలు షఫీఉద్దీన్‌తో డ్రా చేయించాడు. అక్కడి నుంచి 2వ తేదీ గన్నవరానికి వచ్చి లాడ్జిలో షఫీఉద్దీన్‌ను బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. వీడియో కాల్‌ ద్వారా కొట్టిన దృశ్యాలు బాధితుడి కుటుంబ సభ్యులకు చూపించి చంపుతానని బెదిరించాడు.  

నిందితుడు పాలిటెక్నిక్‌ విద్యార్థి.. 
కిడ్నాప్‌ కేసులో నిందితుడు కాలిద్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థి కావడంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. నిందితుడు కాలిద్‌ (21) ఏలూరులో చదువుతున్నాడు. అతను దురలవాట్లకు బానిసగా మారాడు. తండ్రి లేకపోవడంతో తల్లిపైనే ఆధారపడి ఉంటున్నాడు. తన తల్లితో షఫీఉద్దీన్‌ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తట్టుకోలేకపోయాడు. అతన్ని కిడ్నాప్‌ చేసి సొమ్ము రాబట్టి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో కిడ్నాప్‌ చేశాడు. సినిమా ఫక్కీలో కథ నడిపినా చివరకు పోలీసులకు చిక్కాడు. కాగా గాయపడిన బాధితుడిని పోలీసులు చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఈ కిడ్నాప్‌ కేసులో మరో ముగ్గురు, నలుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మరింత లోతైన విచారణ నిర్వహిస్తేగానీ పూర్తి వివరాలు వెల్లడికావు.

ఫలించని అతితెలివి.. 
కిడ్నాప్‌ చేసిన వ్యక్తి అతితెలివితేటలు ప్రదర్శించి చివరకు పోలీసులకు చిక్కాడు. నిందితుడు చివరకు తనకు రూ.10 లక్షలు ఇస్తే కిడ్నాప్‌ చేసిన షఫీఉద్దీన్‌ను వదిలేస్తానని అతని కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, పెనమలూరు పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి స్కెచ్‌ వేశారు. బ్యాగ్‌లో నకిలీ నోట్లు రూ.10 లక్షలు పెట్టి బాధితుడి కుమారుడు మిస్బాఉద్దీన్‌ను ఆటోలో ఎక్కించి నిందితుడు చెప్పిన గన్నవరం ప్రాంతానికి పంపారు. బ్యాగ్‌ ట్రాకింగ్‌ కోసం సెల్‌ఫోన్‌ ఉంచారు. దీంతో ఆటో  ఎటువెళుతోందనే విషయాన్ని పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగారు. నిందితుడు కూడా ఫోన్‌ ట్రాకింగ్‌తో ఆటోను అనుసరించాడు. గూడవల్లి వద్ద ఆటోలోని క్యాష్‌ బ్యాగ్‌ను వదిలి వెళ్లాలని నిందితుడు తెలపడంతో బ్యాగ్‌ అక్కడ వదిలారు. ఆటో వెళ్లగానే నిందితుడు అక్కడకు రాగానే పోలీసులు ఒక్కసారిగా దాడి చేసిపట్టుకున్నారు. ఫోన్‌ ట్రాకింగ్‌ విషయంలో ఒకరికి తెలియకుండా ఒకరు వేసిన స్కెచ్‌లో పోలీసులే విజయం సాధించారు.

మరిన్ని వార్తలు