చేతబడి నెపంతో కుటుంబంపై దాడి

22 Jun, 2018 11:35 IST|Sakshi
కైకలూరు ప్రభుత్వాస్పత్రిలో దాడికి గురైన వెంకటేశ్వరరావును బెడ్‌పైకి చేరుస్తున్న బంధువులు

కొల్లేరు గ్రామాల్లో సమసిపోని మూఢ నమ్మకాలు

ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

మండవల్లి పోలీసులకు ఫిర్యాదు

టీడీపీ నేత కార్యాలయానికి చేరిన వివాదం

కైకలూరు : శాస్త్ర విజ్ఞానం శరవేగంగా ఓ వైపు దూసుకుపోతున్నా కొల్లేటి లంక గ్రామాల్లో మూఢ నమ్మకాల జాఢ్యం మాత్రం వీడటం లేదు. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఓ కుటుంబాన్ని చితకబాదిన ఘటన మండవల్లి మండలం నుచ్చిమిల్లి గ్రామంలో బుధవారం అర్థరాత్రి జరిగింది. కైకలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నుచ్చిమిల్లి గ్రామంలో జయమంగళ రంగారావు, సత్యం సోదరుల మధ్య భూ సరిహద్దు వివాదం కొనసాగుతోంది. సత్యం కుటుంబంలో ఒకరి ఆరోగ్యం బాగుండలేదు. దీంతో ఓ స్వామీజీని ఆశ్రయించగా ఎవరో చేతబడి చేశారని చెప్పారు. విభేదాల కారణంగా రంగారావు ఈ పని చేయించాడని భావించి గ్రామ పెద్దలకు సత్యం బంధువులు ఫిర్యాదు చేశారు.

దీంతో పంచాయతీ చెరువు వద్ద పంచాయితీ పెట్టారు. రంగారావు పూజలు చేస్తున్నాడని ఓ యువతి సాక్ష్యం చెప్పింది. రంగారావును పెద్దలు భయపెడుతూ నిలదీయగా, గ్రామంలో ఘంటసాల వెంకటేశ్వరరావు (40) కుటుంబం ఇటువంటి పూజలు చేస్తున్నారని చెప్పాడు. వారిని పిలిచి కొట్టడంతో తప్పని పరిస్థితుల్లో పూజలు చేశామని వారు ఒప్పుకున్నారు. దీంతో గ్రామస్తులు వెంకటేశ్వరరావును చితకబాదారు. అడ్డు వచ్చిన అతని భార్య లక్ష్మి, తల్లి చుక్కమ్మను కూడా కొట్టారు. వెంకటేశ్వరరావు కుమారుడు జయరామకృష్ణ స్టేషన్‌కు ఫోన్‌ చేస్తే డ్యూటీలో నేను ఒక్కడినే ఉన్నాను. మీ సర్పంచ్‌తో మాట్లాడతానని సదరు పోలీసు చెప్పడంతో అందరూ కంగుతిన్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు పోలీసులు గ్రామానికి వచ్చారు. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో క్షతగాత్రులు కైకలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. తమను క్షుద్రపూజలు చేశారని ఒప్పుకోవాలని గ్రామ పెద్దలు చిత్రహింసలకు గురి చేశారని బాధితులు మండవల్లి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

రంగంలోకి రాజకీయవేత్త..
నుచ్చుమిల్లి వ్యవహారం వికటిండచడంతో గ్రామ పెద్దలు ఓ టీడీపీ నేతను ఆశ్రయించారు. అయ్యిందేదో అయ్యింది.. రాజీ పడతామని ఆయనతో చెప్పారు. దీంతో బాధితులతో రాయబారాలు నడుపుతున్నారు. నయానో, భయానో ఒప్పించడానికి యత్నాలు జరుగుతున్నాయి. చితకబాది ఇప్పుడు రాజీ అంటే ఎలా.. అని బాధిత బంధువులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అన్యాయంగా కొట్టిన పెద్దలకు శిక్ష పడాలని కోరుతున్నారు. ఈ విషయంపై కైకలూరు సీఐ రవికుమార్‌ను వివరణ కోరగా ఇద్దరు సోదరుల మధ్య వివాదం కారణంగా చిన్నపాటి ఘర్షణ జరిగిందని తేలిగ్గా కొట్టేశారు. తప్పుడు ఫిర్యాదుగా భావిస్తున్నామన్నారు. 

మరిన్ని వార్తలు