చెడ్డీ గ్యాంగేనా?

27 Mar, 2018 11:17 IST|Sakshi
ఏలూరు శాంతినగర్‌లో ఒక ఇంటిలో దోపిడీ దొంగల ముఠా

ఏలూరు ఘటనలోదర్యాప్తు ముమ్మరం

పోలీసుల తీరుపైతీవ్ర అసంతృప్తి

సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంపై

విమర్శలు వ్యక్తిగత కక్షలపైనా దృష్టి

ఏలూరు టౌన్‌ :శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులదే కీలకపాత్ర. ఏదైనా ఆపద వస్తే మొదటిగా గుర్తుకు వచ్చేది పోలీసులే. కానీ ఏలూరులో చెడ్డీ గ్యాంగ్‌గా అనుమానిస్తున్న దోపిడీ దొంగల ముఠా ఒక ఇంట్లో దోపిడీ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో బాధితులు పోలీసులకు ఫోన్‌ చేసి రక్షించాలని కోరినా వారు పట్టించుకోకపోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. 45 నిమిషాల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తన భార్య, కుమార్తెతో బాధితుడు బిక్కుబిక్కుమంటూ వేచి చూసినా పోలీసుల నుంచి స్పందన లేకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

పోలీసుల తీరుపై అసంతృప్తి
ఏలూరు శాంతినగర్‌ 8వ రోడ్డులో చేపల వ్యాపారి సరెళ్ల రామకృష్ణ ఒక న్యాయవాది ఇంట్లోని కింది పోర్షన్‌లో అద్దెకు ఉంటున్నారు. భార్య, కుమార్తెతో ని వాసం ఉంటున్నారు. దోపిడీ దొంగలు ఇంటి తలుపులు ఊడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 100కు ఫోన్‌ చేయగా అక్కడి సిబ్బంది త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. కానీ సెంట్రీ విధుల్లో ఉన్న సిబ్బంది స్పందించలేదు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదా? ఇచ్చినా వారు స్పందించలేదా? అనేది సందేహంగా మారింది. 45 నిమిషాల పాటు దోపిడీ దొంగల ముఠా ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా అక్కడికి పోలీసులు వెళ్లలేని దుస్థితి నెలకొంది. రాతిర 1.58 గంటలకు బాధితుడి స్నేహితుడు, మరో ఇద్దరు కారులో హారన్‌ కొడుతూ వెళ్లటంతో ఆ గ్యాంగ్‌ మెల్లగా జారుకున్నట్టు చెబుతున్నారు. పోలీసులు వెంటనే స్పందించి ఉంటే దోపిడీ దొంగల ఆటలు కట్టించే అవకాశం ఉండేదని అంటున్నారు. బాధితులు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వేకువజాము 2.30 గంటల ప్రాంతంలో వెళ్లి ఫిర్యాదు చేసినా రేపు వస్తే కేసు నమోదు చేద్దామని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. నగరంలోనే పోలీసుల తీరు ఈ విధంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

డోర్‌ బోల్టు రాకపోవడం వల్లే..
ముందువైపు డోర్‌ను రాకుండా మోటార్‌ సైకిల్‌కు కట్టేసి, వెనుకవైపు కిచెన్‌ డోర్‌ను పగులగొడుతూ ఆరుగురు దోపీడి దొంగల ముఠా కళ్లముందు కనిపిస్తుంటే ఆ కుటుంబం భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంది. కేవలం ఒకే ఒక్క బోల్టు తమ ప్రాణాలను అడ్డుకుందని, లేకుంటే దారుణం జరిగిపోయి ఉండేదంటూ బాధితులు తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. పదునైన ఇనుప పరికరంతో మధ్య, కింది బోల్టులను అప్పటికే దొంగలు పగులగొట్టారని, ఒక పైబోల్టు ఊడితే చాలని లోనికి వచ్చేవారని బాధితులు చెబుతున్నారు.

వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా?
బాధితుడు రామకృష్ణ ఇంటిపై దాడికి ప్రయత్నించింది దోపిడీ దొంగల ముఠాయేనా? లేక రామకృష్ణ అంటే గిట్టనివారు ఏవరైనా ఏవైనా వ్యక్తిగత కక్షలతో టార్గెట్‌ చేశారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రామకృష్ణ బంధువులు సైతం శత్రువులు ఎవరైనా దాడికి ప్రయత్నించారేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులు ఎవరు అనే దానిపై బంధువులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసు అధికారులు సైతం మరో కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. దాడి చేసి దానిని దోపిడీ దొంగలు చేసినట్టు పక్కదారి పట్టించే క్రమంలోనే ఇలా చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వేలిముద్రల నిపుణుల విచారణ  
ఏలూరులో హల్‌చల్‌ చేసిన దోపిడీ దొంగల ముఠా చెడ్డీ గ్యాంగా, షోలాపూర్‌ గ్యాంగా? లేక ఎవరనే విషయాలపై పోలీస్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మోటారు సైకిల్, తలుపులు కొన్నిచోట్ల దొంగల వేలిముద్రలు సేకరించిన పోలీసులు వాటిని ఫోరెన్సిక్‌ నిపుణులకు పంపినట్టు తెలుస్తోంది. వేలిముద్రల సాయంతో ఏ రాష్ట్రానికి చెందిన ముఠా అనేది తెలు స్తుందని అధికారులు చెబుతున్నారు. వేలిముద్రల ఆధారంగా అది దోపిడీ గ్యాంగా? లేక వ్యక్తిగత కారణాలతో శత్రువులు ఎవరైనా టార్గెట్‌ చేసి దాడి చేసేందుకు ప్రయత్నించారా అనే విషయాలపై స్పష్టత వస్తుందని పోలీస్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు