కొట్టేసిన చోటే అమ్మేస్తాడు !

5 Jul, 2020 09:13 IST|Sakshi

ఉదయం రెక్కీ రాత్రి చోరీ  

సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డితో పాటు తమిళనాడులోనూ దొంగతనాలు 

18 కేసుల్లో నిందితుడు కర్ణాటక 

కిలాడీ బస్వరాజ్‌ ప్రకాష్‌ అరెస్ట్‌ 

సాక్షి, సిటీబ్యూరో : నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఉదయం పూట రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు ఇంటి తాళాలు పగుల గొట్టి చోరీలు చేస్తున్న కర్ణాటకకు చెందిన ఘరానా దొంగను సైబరాబాద్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోనే కొట్టేసి ఇక్కడే అమ్మేస్తుంటాడు. ఇది వీలుకాని పక్షంలో ముత్తూట్, పాన్‌ బ్రోకర్‌ దుకాణాల్లో తనఖా పెడుతున్న బెంగళూరు రాంనగగర్‌లోని హమాపూర్‌కు చెందిన బస్వరాజు ప్రకాష్‌ నుంచి రూ.70 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మీడియాకు తెలిపారు.  

నాలుగు ప్రాంతాల్లో 18 చోరీలు  
తరుచుగా హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే బస్వరాజు ప్రకాష్‌ పగటి సమయంలో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో చక్కర్లు కొట్టేవాడు. తాళం వేసి ఉన్న అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లతో పాటు ఇండిపెండెంట్‌ హౌస్‌లను రెక్కీ చేసేవాడు. ఆ తర్వాత రాత్రి సమయాల్లో ఆ ఇంటికి వెళ్లి తాళాలు పగులగొట్టి బీరువాలో దాచిన డబ్బు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లేవాడు. ఒక్కడిగానే వచ్చి ఈ చోరీలు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు సంగారెడ్డిలోనూ చేశాడు. ఈ చోరీ చేసిన బంగారు ఆభరణాలు పాన్‌ బ్రోకర్‌ దుకాణాల్లో తక్కువ రేటుకే అమ్మి డబ్బులతో లగ్జరీలైఫ్‌ గడిపేవాడు. వీలుకాని పక్షంలో ముత్తూట్‌ ఫైనాన్స్‌లో బంగారు ఆభరణాలు తనఖా పెట్టి డబ్బులు తీసుకునేవాడు. గతంలో ప్రశాష్‌ను కర్ణాటక పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 18 ఇళ్లలో చోరీలు చేశాడు.  

ఇలా చిక్కాడు  
కేపీహెచ్‌బీ ఆరు, బాచుపల్లి  రెండు, కూకట్‌పల్లి  రెండు, జవహర్‌నగర్‌  ఏడు, ఎల్‌బీనగర్‌ ఒకటి, వనస్థలిపురంలో ఐదు, అమీన్‌పూరలో మూడు, తమిళనాడు హసూర్‌లలో రెండు ఇలా మొత్తం 18 చోరీలు చేశాడు. అయితే ఇటీవల కాలంలో కేపీహెచ్‌బీలో జరిగిన ఇళ్లల్లో చోరీ చేసిన సమయంలో లభించిన వేలి ముద్రలు, బాచుపల్లి, కూకట్‌పల్లిలో జరిగిన చోరీలో లభించిన వేలిముద్రలు ఒకలే ఉన్నాయని పోలీసులు గమనించారు. ఈ మేరకు సీపీ సజ్జనార్‌ ఆదేశాలతో మాదాపూర్‌ స్పెషల్‌ అపరేషన్‌ టీమ్‌ (ఎస్‌వోటీ) బృందంగా ఏర్పడి పాత నేరస్థుడు బస్వరాజు ప్రకాష్‌పై నిఘా ఉంచిన పోలీసులు కేపీహెచ్‌బీ పోలీసులతో కలిసి శనివారం అరెస్టు చేశారు. రూ.70 లక్షల విలువైన 1,013 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.2 కిలోల వెండి ఆభరణాలు, బ్రీజా కారు, డియో మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘరానా నేరగాడిని పట్టుకున్న పోలీసులను సీపీ సజ్జనార్‌ ప్రశంసించారు.   

మరిన్ని వార్తలు