అల్లుడిపై కత్తితో దాడి చేసిన మామ

15 Oct, 2019 08:36 IST|Sakshi

సాక్షి, తిర్యాణి(ఆదిలాబాద్‌) : కుమురం భీం జిల్లా తిర్యాణి మండలం నాయకపుగూడలో పరువు దాడి చోటు చేసుకుంది. కూతురు కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని తండ్రి అల్లుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. నాయకపుగూడకు చెందిన సత్యంచారికి ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు కావ్య అదే గ్రామానికి చెందిన నవీన్‌ గత కొద్ది ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. మూడు నెలల క్రితం పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. నూతన దంపతులు మంచిర్యాల జిల్లాలోని సోమంగూడెంకు మకాం మార్చారు. దసరా సందర్భంగా నవీన్‌ వాళ్ల తల్లిదండ్రులు భార్యభర్తలిద్దరిని నాయకపుగూడకు తీసుకొచ్చారు.

కూతురు గ్రామంలోకి వచ్చిందని తెలుసుకున్న సత్యంచారి నవీన్‌పై కోపం పెంచుకున్నాడు. అదను కోసం ఎదురుచూస్తున్న సత్యంచారి ఆదివారం అర్ధరాత్రి నవీన్‌ ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. దీంతో నవీన్‌ చేతిపై, పక్కటెములకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిని ప్రతిఘటించి అరుపులు వేయడంతో పక్క గదిలో ఉన్న నవీన్‌ సోదరుడు కిరణ్‌ వచ్చాడు. కిరణ్‌ రాకను గమనించిన సత్యంచారి అక్కడి నుంచి పారిపోయాడు. నవీన్‌ను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లారు. నవీన్‌ సోదరుడి ఫిర్యాదు మేరకు సత్యంచారిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామరావు తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా