వదినను కొట్టొద్దు అన్నందుకు.. తమ్ముడి హత్య

15 Sep, 2019 08:15 IST|Sakshi

సాక్షి, బనగానపల్లె(కర్నూలు) : సొంత తమ్ముడినే అన్న కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన మండల పరిధిలోని చిన్నరాజుపాలెం తండాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన సొంత అన్నదమ్ములు ఈశ్వర్‌నాయక్, శంకర్‌నాయక్‌(35) గ్రామ సమీపంలో పక్కపక్కనే వేర్వేరుగా నివసిస్తున్నారు. శంకర్‌నాయక్‌ అతని భార్య పార్వతీబాయి వ్యవసాయ  పనులకెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈశ్వర్‌నాయక్‌ టైలర్‌ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కాగా ఇటీవల ఈశ్వర్‌నాయక్‌ మద్యానికి బానిసై రోజు భార్య లక్ష్మిబాయిని వేధించేవాడు. కొంతకాలంగా టైలర్‌ పని  విడిచిపెట్టి గౌండా పనికి వెళ్తున్నాడు. శనివారం మాల పున్నమి కావడంతో  ఉదయమే మద్యం తాగి భార్యతో గొడవ పడ్డాడు.

వదినను కొడుతుండగా  శంకర్‌నాయక్‌ అడ్డుకున్నాడు. దీంతో ఆవేశానికి గురైన ఈశ్వర్‌నాయక్‌ తమ్ముడని కూడా చూడకుండా శంకర్‌నాయక్‌ తలపై కర్రతో దాడి చేసి, కత్తితో విచక్షణా రహితంగా కడుపులో పొడిచి, అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో శంకర్‌నాయక్‌ కొంతసేపటికే మృతిచెందాడు. హత్య విషయం తెలుసుకున్న డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి, బనగానపల్లె సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ మహేష్‌కుమార్‌ గ్రామానికి చేరుకున్నారు. హత్యకు దారితీసిన వివరాలను మృతుని భార్యను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నాటుసారా విచ్చలవిడిగా లభిస్తుండటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయిన డీఎస్పీ నరసింహరెడ్డికి గ్రామస్తులు విన్నవించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, మృతుడి భార్య పార్వతిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేష్‌రెడ్డి తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా పండుగ పూట, సొంత అన్నచేతిలోనే తమ్ముడు హత్యకు గురికావడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా