టీషర్ట్స్‌ దాచి అడ్డంగా దొరికిపోయాడు

14 Mar, 2020 09:54 IST|Sakshi

టీ.నగర్‌ : తిరుపూర్‌ సమీపంలో తాను పనిచేస్తున్న ఓ కంపెనీ నుంచి వేల రూపాయల విలువైన టీ షర్ట్‌లను దుస్తుల్లో దాచి చోరీ చేసిన వ్యక్తిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు.. తిరుపూర్‌ జిల్లా పెరుమానల్లూర్‌ సమీపంలోని నేతాజీ అపేరెల్‌ పార్క్‌లో అనేక ఎక్స్‌పోర్ట్‌ బనియన్‌ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. వీటిలో బయటి రాష్ట్రాలకు చెందిన అనేకమంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులోని ఒక ఎక్స్‌పోర్ట్‌ సంస్థలో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన కార్మికుడు ఒకడు పనిచేస్తున్నాడు.

కాగా ఈ ఘటన జరిగిన రోజున ఆ వ్యక్తి తన విధులు ముగించుకుని కంపెనీ నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో గేట్‌ వద్ద ఉన్న వాచ్‌మన్‌కు అతనిపై అనుమానం ఏర్పడింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానం చెప్పాడంతో వాచ్‌మన్‌ అతని వద్ద తనిఖీలు జరిపాడు. తను వేసుకున్న షర్ట్‌ లోపల టీషర్టులను ధరించినట్లు గుర్తించాడు. ప్యాంట్‌లో కూడా కొన్ని షర్ట్‌లను దాచుకున్నాడు. ఈ విధంగా మొత్తం 40 టీషర్ట్‌లను దాచినట్లు తెలిసింది. వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్న సంస్థ నిర్వాహకులు కార్మికుడిని హెచ్చరించి, ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.  

మరిన్ని వార్తలు