చదువు చెప్తానని.. డబ్బుతో ఉడాయించాడు

6 Oct, 2019 08:55 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : నగరంలో కొన్నాళ్లుగా తిష్టవేశాడు. ఏడాది వరకు ఇక్కడ పలు కళాశాలల్లో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా పనిచేశాడు. యూఎస్‌ఏలో చదువకున్నా... రోబోటిక్స్‌లో ప్రావీణ్యం ఉంది... కళాశాల ప్రారంభించి స్టెమ్‌ ఎడ్యుకేషన్‌ పరిచయం చేస్తానని అందరినీ నమ్మించాడు... ఈ క్రమంలో పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు... వరంగల్‌కు చెందిన ఈ ప్రబుద్ధుడిని సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. పైనాపిల్‌కాలనీ వద్ద రీజినల్‌ సీఐడీ కార్యాలయంలో అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌ జిల్లా హనుమకొండకు చెందిన బైరి అజిత్‌కుమార్‌ రెడ్డి 2016లో విశాఖ వచ్చాడు. ఇక్కడ సంజయ్‌కుమార్‌ గురడే అనే మారు పేరుతో అందరికీ దగ్గరయ్యాడు.

2018 వరకు కృష్ణా కాలేజీ ప్రాంతంలో భానునగర్‌లో నివాసముండేవాడు. పలు ప్రైవేట్‌ కాలేజీలలో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా పనిచేశాడు. అక్కడ పనిచేస్తూ యూఎస్‌ఏలో పెద్ద చదువులు చదివి నట్లు తన వాక్చాతుర్యంతో చెప్పుకొన్నాడు. రోబోటిక్స్‌లో ప్రావీణ్యం ఉన్నట్లు అందరినీ నమ్మించాడు. స్టెమ్‌ ఎడ్యుకేషన్‌ పరిచయం చేయడానికి అధిక మొ త్తంలో పెట్టుబడి అవసరమని అందరికీ చెప్పాడు. దీంతో యూఎస్‌ఏలో ఉంటున్న శ్యామ్‌ వెంకటప్పతోపాటు మరికొందరు ఆయన ప్రలో భాలకులోనై సుమారు రూ.1.65 కోట్లు అప్పగించేశారు. ఆ డబ్బులతో సంజయ్‌కుమార్‌ 2018 డిసెంబరు 8న పరారయ్యాడు.

దీనిపై విశాఖలో ఉన్న సీఐడీ పోలీసులకు యూఎస్‌ఏలో ఉన్న బాధితుడు శ్యామ్‌ వెంకట్‌ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన సీఐడీ పోలీసులు ఈ నెల 2న హైదరాబాద్‌ సమీప ఎల్బీ నగర్‌లో ఆయన నివాసం వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. అక్కడి నుంచి తీసుకొచ్చి అదేరోజు విశాఖ కేంద్ర కారాగారానికి అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు జైల్‌లో ఉంటున్నాడు. ఆయన వశిష్ట క్లాసెస్, సంజీవిని ఐఐటీ అండ్‌ మెడికల్‌ అకాడమీ పేరుతో నగరంలో రామాటాకీస్, శంకర మఠం వద్ద ఇన్‌స్టిట్యూట్స్‌ నిర్వహించి ఇంటర్మీడియట్‌ విద్యార్థులను మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు. అతను బీఎస్సీ, బీటెక్‌ చదువుకొని విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడని... ఇందులో భాగంగా విద్యార్థులను, పలువురు ఎన్‌ఆర్‌ఐలను, విద్యావంతులను మోసం చేశాడని ఏఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆయనకు డబ్బులు ఇచ్చిన బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే పైనాపిల్‌కాలనీలో సీఐడీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు