పరిటాల శ్రీరామ్‌ తనకు కజిన్‌ అంటూ..

31 Jul, 2019 12:08 IST|Sakshi
నిందితుడు కొండూరి రాజేష్‌, వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌

జల్సాల కోసం ఓ ప్రబుద్ధుడు మోసాల బాటపట్టాడు. మాయమాటలతో యువతీ యువకులకు టోపీ పెట్టాడు. తనకు ఎంతో పరపతి ఉందని, పరిటాల శ్రీరామ్‌ కజిన్‌ అవుతాడని, బెంగళూరులో రిసార్టులు ఉన్నాయని సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. ఉద్యోగాలిప్పిస్తానని యువకులకు...సినిమాల్లో వేషాలిప్పిస్తానని యువతులకు గాలం వేశాడు. వారి నుంచి రూ.కోట్లు దండుకున్నాడు.

సాక్షి, హైదరాబాద్‌ ‌: ఖరీదైన అద్దెకార్లలో తిరుగుతూ.. సూటు బూటు వేసుకొని స్టార్‌ హోటళ్లలో బస చేస్తూ.. తాను పరపతి ఉన్న వాడినని ప్రముఖ సినీ, రాజకీయ, అధికారులతో దిగిన ఫొటోలతో సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను, సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని పలువురు యువతులకు టోకరా వేసిన మాటల మాంత్రికుడిని మంగళవారం జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ మేరకు వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్, బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌రావు, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.బాలకృష్ణారెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా, పుట్టపర్తి మండలం, రాచవారిపల్లి గ్రామానికి చెందిన కొండూరి రాజేష్‌ అలియాస్‌ కె.రమేష్‌బాబు, అలియాస్‌ విష్ణువర్ధన్‌రెడ్డి బికాం చదివి ఖాళీగా ఉండేవాడు. తన తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి రూ. కోట్లు సంపాదించాలని పథకం పన్నాడు. 

ఈ నేపథ్యంలో ప్రశాసన్‌నగర్‌కు చెందిన కోగంటి నౌషిక అనే ఫ్యాషన్‌ డిజైనర్‌తో గత ఏడాది ఫిబ్రవరిలో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకున్న అతను తానో సినీ నిర్మాతనని, కొత్త సినిమా తీస్తున్నానని, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కావాలని పరిచయం  పెంచుకున్నాడు. తనకు అనంతపురంలో చాలా స్థలాలు ఉన్నాయని, పరిటాల శ్రీరామ్‌ తనకు కజిన్‌ అవుతాడని, బెంగళూరులో రిసార్ట్‌లు ఉన్నట్లు నమ్మించాడు.

బీహెచ్‌ఈఎల్‌లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టు ఖాళీగా ఉన్నట్లు చెప్పడంతో ఆమె తన తమ్ముడికి ఆ ఉద్యోగం ఇప్పించాలని రూ.4 లక్షలు ఇచ్చింది. అంతటితో ఆగకుండా మరోసారి రూ.10.36 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పించేందుకు మరింత ఖర్చవుతుందని చెప్పడంతో ఆమె మరోసారి రూ.13.65 లక్షలు ఇచ్చింది. ఇలా ఆమె నుంచి 15 దఫాలుగా రూ.36.44 లక్షలు వసూలు చేశాడు. అయితే ఉద్యోగం ఇప్పించకపోగా కొన్ని రోజులుగా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ముఖం చాటేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ఈ నెల 3న జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్‌ చేశారు.  

వందల మందికి బురిడీ 
నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు అతను గత మూడేళ్లుగా జల్సాల కోసం పలువురు యువకులను ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు తేలింది. గతంలో ఇదే తరహా కేసులో మాదాపూర్‌ పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. వందలాది మంది నిరుద్యోగుల నుంచి రూ.కోటి దాకా వసూలు చేసినట్లు తేలింది.  

బంజారాహిల్స్‌లో ఆఫీసు 
నిందితుడు బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–5లో హలో ‘భారత్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ పేరుతో ఓ కార్యాలయం తెరిచి తాను సినిమా నిర్మాతనని, ప్రముఖ హీరోలతో దిగిన ఫొటోలు చూపుతూ హీరోయిన్‌ వేషాలు ఇప్పిస్తానని యువతులను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు.

బెంజ్‌ కార్లు..ప్రముఖులతో పార్టీలు 
మోసాల ద్వారా సంపాదించిన సొమ్ముతో రాజేష్‌ జల్సా జీవితం అనుభవించేవాడు. ఖరీదైన దుస్తులు వేసుకొని, అద్దెకు తీసుకున్న బెంజ్‌ కార్లలో తిరుగుతూ రూ. లక్షల విలువైన మొబైల్‌ ఫోన్లు వాడుతూ, స్టార్‌ హోటళ్లలో బస చేస్తూ, ప్రముఖులతో పార్టీల్లో మునిగి తేలేవాడని పోలీసులు తెలిపారు. అటు యువకులను ఉద్యోగాల పేరుతో, ఇటు యువతులను సినిమా వేషాలు పేరుతో నమ్మించి మోసాలకు పాల్పడుతున్న అతను ఇన్నాళ్లు పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడు.

నిందితుడిపై వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మొత్తం 14 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్, బంజారాహిల్స్, చైతన్యపురి, మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఎఫ్‌ఐఆర్‌ కాని కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు