నమ్మించి మోసం చేశారు !

31 Dec, 2019 08:45 IST|Sakshi

సాక్షి, వనపర్తి : షాపు యజమాని దగ్గర పనికి కుదిరాడు.. అతనితో నమ్మకంగా ఉండటంతో యజమాని షాపు తాళాలు అప్పగించాడు. అదే అదునుగా భావించిన నిందితుడు  షాపులో ఉన్న వెండి కాళ్ల గొలుసులను తీసుకుని పారిపోయాడు. ఈ నేపథ్యంలో సోమవారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలోని శంకర్‌గంజ్‌లో బంగారు షాపు యజమాని మహబూబ్‌ దగ్గర మహమ్మద్‌ షరీప్‌ పనికి కుదిరాడు. 

షాపు యజమానికి మహ్మాద్‌ షరీఫ్‌పై నమ్మకం కుదరడంతో అతనికి షాపుతాళాలు ఇచ్చి తెరిపించేవాడు. ఇదే అదునుగా భావించిన నిందితుడు ఈనెల 17న షాపు తెరిచి అందులో ఉన్న 4 కిలోల వెండి కాళ్ల గోలుసులు తీసుకుని, చింతలహనుమాన్‌ దేవాలయం వెనుకాల గుంతతీసి దాచిపెట్టాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా వాటిపై రాళ్లు పెట్టి కడపకు వెళ్లాడు. షాపు యజమాని వచ్చి చూడగా.. షాపును కొద్దిగా మూసి అతను కనిపించకుండా పోయాడు. ఫోన్‌ చేసినా స్వీచ్‌ ఆఫ్‌ అయ్యింది.

అనుమానం వచ్చిన యజమాని మహబూబ్‌ ఆభరణాలు పరిశీలించగా..దొంగతనం అయ్యాయని భావించాడు. దీంతో ఈ నెల 27న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం కడప నుంచి వనపర్తికి వచ్చిన మహమ్మద్‌ షరీప్‌ తాను దొంగతనం చేసిన 4 కిలోల పట్టీలలో 10 జతల కాళ్ల పట్టీలు తీసుకుని కొత్తకోట, ఆత్మకూర్‌లో అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వనపర్తి ఆర్టీసి బస్టాండ్‌కు రాగా ఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్, సిబ్బంది తనిఖీ చేసి విచారించారు. నిందితుడు నేరం ఒప్పుకోవడంతో గుడి వెనకాల దాచిపెట్టిన మిగతా కాళ్లపట్టీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కాగా, నిందితున్ని కోర్టులో ప్రవేశపెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా