మెట్రో స్టేషన్‌ నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య 

9 Nov, 2018 01:26 IST|Sakshi
మృతిచెందిన గుర్తు తెలియని వ్యక్తి

హైదరాబాద్‌: రాజధానిలోని అమీర్‌పేట మెట్రోరైల్‌ స్టేషన్‌ మొదటి అంతస్తు పైనుంచి దూకి గుర్తుతెలియని వ్యక్తి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం 7.40 గంటలకు ఓ గుర్తుతెలియని వ్యక్తి అమీర్‌పేట సారథి స్టూడియో వైపు నుంచి మెట్రో స్టేషన్‌ మెట్లపై నుంచి చేతులు ఊపుకుంటూ మొదటి అంతస్తుకు వెళ్లాడు. రేలింగ్‌ వద్ద కొద్దిసేపు నిలబడి అటూఇటూ చూస్తూ ఒక్కసారిగా దానిపైకి ఎక్కాడు. కొద్దిదూరంలో నిలబడి ఉన్న మరో వ్యక్తి గమనించి పడిపోతావు కిందకు దిగు అంటుండగానే దూకేశాడు. వ్యక్తి పడిపోవడాన్ని గమనించిన స్థానికులు మెట్రో అధికారులకు సమాచారం అందించారు.

భద్రతా సిబ్బంది వెళ్లి రాళ్లపై పడిన వ్యక్తిని చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. స్టేషన్‌ కంట్రోలర్‌ చక్రవర్తి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ జరిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఒంటిపై చొక్కా మినహా ఎలాంటి దుస్తులు లేవు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని, బంధువులు ఎవరైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు