ఎవరు లేరని స్నేహితుడి ఇంట్లోనే..

10 Feb, 2020 12:07 IST|Sakshi

చోరీ కేసులో సీసీ పుటేజ్‌ ఆధారంగా అరెస్టు 

సాక్షి, అల్లాదుర్గం(మెదక్‌): ఇంట్లో ఎవరూ లేని సమాచారంతో స్నేహితుడే చోరీకి పాల్పడ్డాడు. సీసీ కెమెరా పుటేజ్‌ ఆధారంగా ఐదు రోజుల్లో దొంగను పట్టుకుని అరెస్టు చేసి, దొంగను రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి అల్లాదుర్గం ఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఆదివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు చెప్పారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని..అల్లాదుర్గం మండలం కాయిదంపల్లి గ్రామానికి చెందిన జీల సంగమేశ్వర్‌ ఈ నెల 4న కుటుంబ సభ్యులతో తిరుపతికి వెళ్లారు. సంగమేశ్వర్‌ ఇంటి పక్కనే ఉన్న స్నేహితుడైన జీల లక్ష్మయ్యకు ఇంటిని చూడాలని చెప్పారు.

ఇదే అదనుగా భావించి లక్ష్మయ్య దొంగతనానికి పాల్పడినట్లు ఎస్‌ఐ చెప్పారు. లక్ష్మయ్య తన నిచ్చెనతో సంగమేశ్వర్‌ వెళ్లిన రోజే ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న 4 తులాల బంగారు ఆభరణాలు, రూ.16 వేల నగదు చోరీ చేశారు. సంగమేశ్వర్‌ ఫిర్యాదుతో ఈ నెల 6న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ చెప్పారు. గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా లక్ష్మయ్య 4 తేదీ రాత్రిలో సంగమేశ్వర్‌ ఇంటి ప్రాంతంలో తిరుగుతూ కనిపించినట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారు జామున కాయిదంపల్లి     గ్రామానికి పెట్రోలింగ్‌కు వెళ్లగా లక్ష్మయ్య ఉండటంతో అనుమానంతో పట్టుకుని విచారించగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని, అతని వద్ద 4 తులాల బంగారు ఆభరణాలు, రూ.16వేల నగదు స్వాదీనం  చేసుకున్నట్లు ఎస్‌ఐ వివరించారు. సంఘటన స్థలంలోని వేలిముద్రలను లక్ష్మయ్య వేలిముద్రలు సరిపోలడంతో అతన్ని అరెస్టు చేసి, ఆదివారం రిమాండ్‌ చేసినట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు