అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి! 

30 Jun, 2020 08:22 IST|Sakshi

బెంగళూరు విద్యార్థినితో  నగర యువకుడి ప్రేమాయణం  

ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా ఇద్దరికీ పరిచయం 

హ్యాకింగ్‌ ద్వారా గుర్తించిన ఆ బాలిక తండ్రి 

యువకుడిపై కేసు నమోదు  

నిందితుడిని పట్టుకోవడానికి త్వరలో నగరానికి బెంగళూరు కాప్స్‌ 

సాక్షి, సిటీబ్యూరో : సోషల్‌మీడియా యాప్‌ ద్వారా పరిచయమైన హైదరాబాద్‌ యువకుడితో ప్రేమలో పడింది బెంగళూరు బాలిక... కొన్నాళ్ళ చాటింగ్‌.. ఆ తర్వాత సహజీవనం ప్రస్తావన తెచ్చాడా యువకుడు. అంతటితో ఆగకుండా ఆమెను మైనర్‌గా ‘చిత్రీకరిస్తూ’ గుర్తింపుకార్డులు సృష్టించాడు.  హైదరాబాద్‌కు వచ్చేయమంటూ ఫ్లైట్‌ టిక్కెట్స్‌ బుక్‌ చేసి మరీ పంపాడు.. ఆ బాలిక అక్కడి విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో అనుమానించిన తండ్రి ఆమె ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాను హ్యాక్‌ చేసి విషయం తెలుసుకున్నారు. హుటాహుటిన ఎయిర్‌పోర్టుకు వెళ్ళి బాలికను ఆపడంతో పాటు బెంగళూరులోని సీఈఎన్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.  దీని ఆధారంగా హైదరాబాద్‌ యువకుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (విష వాయువు లీక్‌.. ఇద్దరు మృతి)

ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాతో పరిచయం...
బెంగళూరులోని ఉత్తరహల్లిలో ఉన్న ఏజీఎస్‌ లేఔట్‌ ప్రాంతానికి చెందిన ఓ బాలిక అక్కడి ప్రముఖ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. సొంతంగా స్మార్ట్‌ ఫోన్‌ కలిగిన ఆ మైనర్‌కు సోషల్‌మీడియా యాప్‌ ఇన్‌స్ట్రాగామ్‌లో ఖాతా ఉంది. ఇందులో యాక్టివ్‌గా ఉండే ఆ బాలికకు గత ఏడాది హైదరాబాద్‌కు చెందిన విశాల్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అదే యాప్‌ కేంద్రంగా వీరిద్దరూ తరచూ గంటల తరబడి చాటింగ్స్‌ చేసుకునేవారు. ఈ పరిచయం పెరగడంతో ఇద్దరూ సన్నిహితంగా మారడంతో ఆ బాలిక తనకు చెందిన కొన్ని ‘వ్యక్తిగత ఫొటోలు’ కూడా షేర్‌ చేసింది. కొన్నాళ్ళకు విశాల్‌ ఆ బాలిక వద్ద ప్రేమ, సహజీవనం ప్రస్తావన తీసుకువచ్చాడు. అప్పటికే అతడి ఆకర్షణలో ఉన్న బాలిక వెంటనే సరేనంది. దీంతో హైదరాబాద్‌ రావాలని, అక్కడే కలిసి జీవిద్దామంటూ విశాల్‌ బాలికతో అన్నాడు. దీనికి బాలిక సైతం అంగీకరించడంతో అసలు కథ మొదలైంది. 

మేజర్‌గా చూపేందుకు ఫోర్జరీ...  
ఆ బాలికతో సహజీవనం చేయాలని పథకం వేసిన విశాల్‌ ఆమెను మేజర్‌గా చూపేందుకు కొన్ని ఫోర్జరీ పత్రాలు సృష్టించాడు. ఆమె పేరు, ఫొటో, వివరాలతో ఓ నకిలీ ఎస్‌ఎస్‌సీ మెమో తయారు చేశాడు. దీంతో పాటు ఈ నెల ఎనిమిదో తేదీకి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు విమానం టిక్కెట్లు ఖరీదు చేసి బాలికకు పంపాడు. ఇంటి నుంచి వచ్చేసే ముందు 15 పాస్‌పోర్ట్‌ ఫొటోలు, ఆధార్‌ కార్డుతో పాటు రూ.10 వేల నగదు తీసుకుని రావాలంటూ సూచించాడు. విశాల్‌ సూచించిన ప్రకారమే ఆ బాలిక ఈ నెల 8 ఉదయం 10.30 గంటల సమయంలో మ్యూజిక్‌ క్లాస్‌కు వెళ్తున్నానంటూ ఇంటి నుంచి బయటకు వచ్చింది. నేరుగా క్యాబ్‌లో బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకుంది. మ్యూజిక్‌ క్లాస్‌కు వెళ్ళిన బాలిక నిర్ణీత సమయం ముగిసినా తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళనపడ్డారు. సదరు మ్యూజిక్‌ టీచర్‌కు కాల్‌ చేయగా... బాలిక అక్కడకు వెళ్ళలేదని తేలింది. 

కూతురు ఇన్‌స్టా చూసి తండ్రి షాక్‌ 
అయితే కొన్నాళ్ళుగా తన కుమార్తె ప్రవర్తనలో మార్పు గమనిస్తున్న బాలిక తండ్రి ఈ పరిణామంతో అప్రమత్తమయ్యారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి హ్యాకర్‌గా మారారు. బాలికకు చెందిన ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాను హ్యాక్‌ చేసిన ఆయన అందులోని అంశాలు గమనించారు. విశాల్‌లో జరిగిన చాటింగ్స్, ఫొటోలు షేర్‌ చేయడం, ఫ్లైట్‌ టిక్కెట్లు ఆయన కంట పడ్డాయి. దీంతో తక్షణం అప్రమత్తమైన ఆయన బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్‌ విమానం కోసం అక్కడి డిపాచ్చర్‌ లాంజ్‌లో వేచి చూస్తున్న బాలికను గుర్తించిన ఆయన ఇంటికి తీసుకువెళ్ళారు. ఆమెకు పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్‌ చేసిన అనంతరం ఈ నెల 17న బెంగళూరులోని సీఈఎన్‌ పోలీసులకు విశాల్‌పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఆ పోలీసులు విశాల్‌పై ఫోర్జరీ, పోక్సో యాక్ట్, ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.   

మరిన్ని వార్తలు