ప్రాణం ఖరీదు ఐదు రూపాయలు..

12 Jan, 2020 08:29 IST|Sakshi

కీ చైన్‌ కత్తితో హారతి గొంతు కోసిన షాహిద్‌ 

సాక్షి, వరంగల్‌ క్రైం: పరిచయం.. స్నేహం... ప్రేమ... ఈ మూడింటితో ఏర్పడేదే బలమైన బంధం. యువత అనుక్షణం తపించే మంత్రం ప్రేమ. అయితే, ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రేమ అంటేనే త్యాగం అనే విషయాన్ని మరిచిపోయి అత్యాచారం.. హత్యలకు పాల్పడి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుస్తున్నారు కొందరు! వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో శుక్రవారం జరిగిన హారతి హత్య కేవలం రూ.ఐదు ఖరీదు చేసే కీ చైన్‌ కత్తితోనని వింటేనే ఒళ్లు జలదరించక మానదు. ‘ప్రేమించాను.. నీవు లేనిదే జీవితం లేదు.. జీవితం అంటేనే నీవు’ అని చెప్పిన ఆ యువకుడికి హారతి గొంతు కోస్తున్నప్పుడు ఈ మాటలు గుర్తొచ్చి ఉంటే ఓ నిండు ప్రాణం బలయ్యేది కాదు.

మరెవరికీ దక్కొద్దు....
ప్రేమించుకున్న తాము విడిపోబోతున్నామని.. తన సొంతమనుకున్న హారతి ఇప్పుడు నిరాకరించడంతో షాహిద్‌ ఆగ్రహానికి గురయ్యాడు. ఆమెను కడతేర్చడానికి ముందే ప్రణాళిక రచించుకున్నాడు. అనుకున్నదే తడవుగా నమ్మించి అద్దె గదికి పిలిపించి ఆయన ప్రేమగా మాట్లాడడంతో పాటు మరోసారి అడిగాడు. దీంతో ‘శివనగర్‌కు చెందిన యువకుడినే నేను పెళ్లి చేసుకుంటాను.. నన్ను మరిచిపో’ అని హారతి ప్రాధేయపడింది. దీనిని తట్టుకోలేని షాహిద్‌ మాయమాటలతో ఆమెను శారీరకంగా అనుభవించాడు. ఆ తర్వాత కీచైన్‌ కత్తితో గొంతు కోయడంతో పాటు రక్తపు మడుగులో ఆమె గిలగిలా కొట్టుకుంటుండగా చూస్తూ ఉండిపోయినట్లు తెలుసుకున్న పోలీసులే ఆయన క్రూరత్వానికి నివ్వెరపోయారు.

వృత్తిరీత్యా మేకల గొంతులు కోసే షాహిద్‌ హారతి గొంతుకోయడంలో ఏ మాత్రం కూడా ఆలోచన చేయకపోవడం.. పోలీసులకు లొంగిపోయాక అనువంత పశ్చాత్తాపం కూడా కనిపించలేదని సమాచారం. తాను హత్య చేయడానికి రూ.ఐదుతో కీచైన్‌ కత్తి(పెన్సిల్‌ చెక్కుకోవడానికి వాడేది) ఉపయోగించడం గమనార్హం. అద్దె గదికి తీసుకెళ్లి ప్రేమగా వెనక నుంచి దగ్గరకు తీసుకోని వీపుపై ముద్దు పెట్టి... బలంగా నోరుమూసి గొంతుకోయడం వల్లే ఐదు నిమిషాల వ్యవధిలోనే హారతి ప్రాణాలను కోల్పోయినట్లు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం.

సెల్‌ఫోన్‌తోనే ముప్పు
హన్మకొండలో తోపుచర్ల రవళి, గాదెం మానస, మునిగాల హారతి ఇలా ముగ్గురి హత్యల వెనక ఉన్న ప్రధాన కారణం సెల్‌ఫోనే. యువతులు తన(ప్రేమించిన వ్యక్తితో)తో కాకుండా ఫోన్‌లో మరెవరితోనైనా మాట్లాడినట్లు తెలిసినా.. ఫోన్‌ ఎంగేజ్‌ వచ్చినా ప్రేమించిన యువకులు అనుమానంతో రగిలిపోతున్నారు. ఆ ఫోన్‌ ఎవరితో మాట్లాడిందో తెలుసుకుని నిలదీయడం.. ఆపై గొడవలు, హత్య వరకు వెళ్తున్నారు.

కమిషనరేట్‌ పరిధిలో ఇటీవల వరుసగా జరిగిన యువతుల హత్యల వెనక ‘కాల్‌ వెయిటింగ్‌’ ఒక కారణమైంది. గాదెం మానస కూడా ఫోన్‌లో యువకుడితో మాట్లాడుతూ నమ్మి మోసపోయింది. మునిగాల హారతి సైతం ఆమె తన స్నేహితుడితో ఎక్కువ సేపు మాట్లాడటం వల్లే నిందితుడు షాహిద్‌ హత్యకు పాల్పడినట్లు విచారణలో  వెల్లడైందని సమాచారం.

బయటకు బంధం.. లోలోపల ప్రేమ!
హారతి హత్య తర్వాత పోలీసులకు లొంగిపోయిన షాహిద్‌ పోలీసుల విచారణలో చెప్పిన విషయాలను పరిశీలిస్తే అనేక కొత్త విషయాలు వెలుగుచూశాయి. వయస్సులో షాహిద్‌ కన్నా హారతి పెద్ద కావడంతో ఆమెను అక్కా.. అని పిలిచే వాడు. హారతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను సైతం అమ్మానాన్న, అక్కా అంటూ సంబోధించేవాడు. దీంతో  కుటుంబ సభ్యులు సైతం షాహిద్‌ను అనుమానించలేదు.

చివరకు హారతి వారి ప్రేమ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పిందని షాహిద్‌ పోలీసులకు వెల్లడించాడు. ఈక్రమంలోనే షాహిద్‌ – హారతి ప్రేమను అంగీకరించని ఆమె తల్లిదండ్రులు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శిక్షణలో ఉన్న ఓ యువకుడితో పెళ్లికి ఏర్పాటుచేశారని తెలిసింది. కానీ, హారతి చేసిన రెండు పడవల ప్రయాణం చివరకు ఆమె ప్రాణాలను బలికొంది. షాహిద్‌ గతంలో హారతి కుటుంబీకులతో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లినప్పుడు కూడా ఇరువురి నడుమ ఏమీ లేనట్లుగా ఉండేవారని సమాచారం. దీంతో హారతి తల్లిదండ్రులు ప్రేమ వ్యవహారాన్ని పసిగట్టలేకపోయారు.
చదవండి: మరో ఉన్మాది

మరిన్ని వార్తలు