అన్నను హత్య చేశారనే పగతో..

11 Jan, 2020 08:11 IST|Sakshi
కేసు వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ కృష్ణ

‘పిల్లిగుండ్ల’ హత్య కేసు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ కృష్ణ 

సాక్షి, గద్వాల క్రైం: పెద్దల ఆస్తి కోసం తరచూ చోటుచేసుకుంటున్న ఘర్షణలు ఒకవైపు.. తన అన్నను గతంలో హత్య చేశారనే అనుమానం, పగ మరోవైపు. దీంతో ఎలాగైనా సదరు వ్యక్తిని అంతం చేయాలని నిర్ణయించి.. పథకం ప్రకారం మద్యం తాగుదామని నమ్మించి మరో వ్యక్తి సాయంతో గురువారం హత్య చేశారు. ఈ హత్యాఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ కృష్ణ వెల్లడించారు. శుక్రవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో హత్యకు దారి తీసిన కారణాలను ఆయనతోపాటు, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ హన్మంతు వివరించారు.  

గద్వాలలోని తెలుగుపేట(గజ్జెలమ్మ వీధి)కు చెందిన కుర్వపాండు ఈ నెల 4వ తేదీన పిల్లిగుండ్ల సమీపంలో హత్యకు గురయ్యాడన్నారు. మృతుడు పాండు, గోవిందు ఇద్దరూ బంధువులు. అయితే అదేకాలనీలో పెద్దల ఆస్తి అయిన ఇట్టి స్థలం వివాదం వారి మధ్య చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే గోవిందు అన్న వెంకటేష్‌ 2015 జూన్‌ 13న మృతి చెందాడు. అయితే, తన అన్న మృతికి పాండు ప్రమేయం ఉందనే అనుమానంతో సదరు వ్యక్తిపై కక్ష్య పెంచుకున్నాడు. ఈ నెల 4వ తేదీన గద్వాల శివారు ప్రాంతమైన పిల్లిగుండ్ల కాలనీలో మద్యం తాగేందుకు గోవిందు బావమరిది వేణు సాయంతో అక్కడికి పిలుచుకొని పాండు కత్తితో పొడిచి హత్య చేశాడని వారు వివరించారు.  

నమ్మించి మట్టుబెట్టారు 
అన్న మృతి అతనే కారణమనే అనుమానం, ఇంటి స్థలం వివాదంతో కక్ష్య పెట్టుకున్న గోవిందు ప్రత్యర్థిని ఎలాగైన చంపాలనే కసితో బావమరిది వేణు సహాయం తీసుకున్నాడన్నారు. పథకం మేరకు ఈ నెల 4వ తేదీన మద్యం తాగేందుకు వెళ్దామని వేణు పాండుకు చెప్పి రాత్రి 8గంటల ప్రాంతంలో తన బైక్‌పై ఎక్కించుకొని పిల్లిగుండ్ల శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడన్నా రు. ఇద్దరం మద్యం తాగుతున్నామని బావమరిది తన బావకు ఫోన్‌ ద్వారా తెలియజేయగా.. గోవిందు సైతం అక్కడకు చేరుకున్నాడన్నారు. ఈక్రమంలో మద్యం మత్తులో ఉన్న వేణును పాండు వెనుక నుంచి వచ్చి పదునైన కత్తితో పొ డిచి హత్య చేశాడన్నారు. అనంతరం మృతదేహాన్ని దగ్గర్లో ఉన్న రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారన్నారు.  

పట్టుబడిందిలా..  
ఈమేరకు మృతదేహం పడిన స్థలాన్ని పరిశీలించామని, అయితే, హత్య చేసిన ప్రాంతంలో తాగిపడేసిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని మద్యం ఎక్కడ కొనుగోలు చేశారనే కోణంలో విచారణ చేపట్టామన్నారు. మద్యం సీసాలకు సంబంధించిన లేబుల్‌ను స్కాన్‌ చేయడంతో పట్టణంలోని కూరగాయాల మార్కెట్‌ సమీపంలో ఓ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించామని వివరించారు.

ఇక సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి రెండు బృందాలుగా వీడిపోయి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితులు పలుమార్లు ఫోన్‌ ద్వారా బంధువులతో మాట్లాడం, మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నామన్నారు. శుక్రవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. అయితే నిందితుల నుంచి ఒక బైక్, రెండు సెల్‌ఫోన్లు, ఓ కత్తి, మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నామన్నారు.

హత్య జరిగిన అయిదు రోజుల వ్యవధిలోని నిందితులను పట్టుకున్నామన్నారు. వీరిని పట్టుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన హేడ్‌ కానిస్టేబుల్‌ భాస్కర్, సాంకేతిక సిబ్బంది చంద్రయ్య, రామకృష్ణ, ప్రేమ్‌కోటిలను ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో పట్టణ ఎస్‌ఐ సత్యనారయణ తదితరులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు