కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

18 Jul, 2019 12:10 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : యువతిని మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసి... పెళ్లికి నిరాకరించడంతోపాటు ఆమెను కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు, రూ.5 వేలు జరిమాన విధిస్తూ నగరంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఒ.వెంకట నారాయణ బుధవారం తీర్పునిచ్చారు. జరిమాన చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో స్పష్టం చేశారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సలాది శ్రీనివాస్‌ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నిందితుడు పాల నటరాజు (23) నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద వెల్డింగ్‌ షాపులో పనిచేస్తున్నాడు. బాధితురాలు (20) అక్కయ్యపాలెం సమీప లక్ష్మీనారాయణపురంలో నివాసం ఉంటోంది. ఏడో తరగతి వరకు చదువుకున్న ఆమె ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఒక ప్రైవేటు కళాశాలలో చిరుద్యోగిగా పనిచేసేది. ఈ నేపథ్యంలో 2014 జనవరి నెలలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తరచూ మాట్లాడుకునే వారు. ఇదే అదనుగా నటరాజు ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు.

పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. దీంతో ఆమె ఆరు నెలల గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అయితే నిందితుడు ఆమెను కులం పేరుతో దూషిస్తూ, తాను పెళ్లిచేసుకోనంటూ దాటవేశాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ బి.మోహన్‌రావు, డీఎం మహేష్, సీఐ ఎస్‌.అప్పలరాజు కేసు దర్యాప్తు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు.

నేరం రుజువు కావడంతో నిందితునికి భారతీయ శిక్షాస్మృతి సెక్షన్‌ 376 కింద ఐదేళ్ల జైలు, రూ.5వేల జరిమాన విధించారు. అలాగే సెక్షన్‌ 417 కింద మోసం చేసినందుకు ఏడాది జైలు, రూ.500ల జరిమాన, ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్‌ 3(2) కింద ఐదేళ్ల జైలు, రూ.5 వేలు జరిమాన విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. అన్ని శిక్షలు ఏక కాలంలో అమలు జరపాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు