బేటా ఉఠో.. బేటా గుర్మిత్..‌!

21 Jan, 2018 07:34 IST|Sakshi

తల్లిని రైలెక్కించబోయి జారిపడ్డ కుమారుడు 

తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం 

తల్లడిల్లిన తల్లి హృదయం

‘బేటా ఉఠో.. బేటా గుర్మిత్‌! జర ఆంఖే ఖోలోకర్‌ దేఖో.. యా గురునానక్‌.. జర రహెం కరో.. మేరే బేటేకో బచావో’ అంటూ కన్నతల్లి హృదయం తల్లడిల్లిపోయింది. కళ్లముందే రైలు కింద పడి తీవ్రంగా గాయపడిన కుమారుడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే కన్న పేగు వేదనకు అంతు లేకుండా పోయింది. బిడ్డను ప్రాణాలతో చూడాలనుకుని పరితపించింది. కనిపించని దేవుళ్లను ప్రార్థించింది. ఉఠోరే గుర్మిత్‌ అంటూ గుండెలవిసేలా రోదించింది. చివరకు తన ఒడిలోనే ప్రాణాలు కోల్పోయిన కుమారుడిని హత్తుకుని బోరున విలపించింది. 

సాక్షి, అనంతపురం: తల్లిని రైలు ఎక్కించే క్రమంలో తనయుడు కాలుజారి రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయి దుర్మరణం చెందాడు. కళ్లెదుటే కన్న కొడుకు ప్రాణాలు కోల్పోవడం చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. వివరాల్లోకెళితే.. పంజాబ్‌లోని ఫసిల్‌కా జిల్లా బలేల్‌కాకమల్‌ గ్రామానికి చెందిన గుర్మిత్‌సింగ్‌ (30) కేకే ఎక్స్‌ప్రెస్‌లో తన తల్లి బీబీకి ఆపరేషన్‌ చేయించేందుకు ఢిల్లీ నుంచి పుట్టపర్తికి బయలుదేరాడు.

శనివారం ఉదయం 9 గంటల సమయంలో కేకే ఎక్స్‌ప్రెస్‌ అనంతపురం వచ్చింది. దాహంగా ఉండటంతో తల్లీకొడుకులు స్టేషన్‌లో దిగారు. కాసేపటికే రైలు కదిలింది. దీంతో గుర్మిత్‌సింగ్‌ అతని తల్లి బీబీ పరుగులు తీశారు. ఈ క్రమంలో తల్లిని రైలెక్కించే క్రమంలో గుర్మిత్‌సింగ్‌ రైల్వే ట్రాక్, రైలు మధ్యలో ఇరుక్కుపోయాడు. కాలు రైలు కింద పడడంతో తీవ్రంగా దెబ్బతింది. శరీరంపై రైలు ఒత్తిడి ఎక్కువ పడడంతో గుర్మిత్‌ సింగ్‌ అక్కడికక్కడే చనిపోయాడు. 

ఉలిక్కిపడ్డ ప్రయాణికులు 
రైల్వే ట్రాక్‌కు, రైలుకు మధ్య చిక్కుకుని గుర్మిత్‌సింగ్‌ మృతి చెందడంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత కేకే ఎక్స్‌ప్రెస్‌ను పది నిమిషాలపాటు ఆపేశారు. గుర్మిత్‌సింగ్‌ తల్లి బీబీ తలకు తీవ్రగాయమై బాధపడుతున్నా రైల్వే అధికారులు కానీ, సిబ్బంది కానీ ఎవరూ పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీసింది.   

రైల్వే అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు 
ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందితే రైల్వే అధికారులు, సిబ్బంది కనీసం తొంగిచూడకపోవడంపై డీవైఎఫ్‌ఐ నాయకులు బాలకృష్ణ మండిపడ్డారు. మృతుడి తల్లికి తీవ్రగాయమైనా ఆస్పత్రికి తరలించేందుకు కూడా ముందుకు రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వైద్యులు కూడా అందుబాటులో లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు