ప్రియుడ్ని బెదిరించిన ప్రియురాలి మేనమామ

26 Jul, 2019 13:12 IST|Sakshi
ఘటనా స్థలంలో విచారణ చేపడుతున్న ఏసీపీ స్వరూపారాణి, సీఐ వెంకునాయుడు

సాక్షి, పెందుర్తి : తాను ఇష్టపడిన అమ్మాయి మరొకరిని ఇష్టపడుతుందన్న అక్కసుతో ఓ యువకుడు బరితెగించాడు. తన అనుచరులతో కలిసి కారులో ఆ అమ్మాయి ఇష్టపడుతున్న యువకుడిని కిడ్నాప్‌ చేసి కలకలం రేపాడు. అంతటితో ఆగకుండా తన వద్ద ఉన్న గన్‌తో వీరంగం చేశాడు. తరువాత ప్రేమించిన అమ్మాయి ఇంటికి అతడిని తీసుకువెళ్లి బెదిరింపులకు పాల్పడ్డాడు. అచ్చంగా క్రైం సినిమాను తలపించిన ఈ ఘటన పెందుర్తిలో గురువారం రాత్రి సంచలనం సృష్టించింది.

బాధితుడు, పోలీసు అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ రైల్వే ఉద్యోగి కుటుంబం పెందుర్తి సమీపంలోని ఓ గ్రామంలో నివాసం ఉంటుంది. రైల్వే ఉద్యోగి కుమార్తె(17) గోపాలపట్నం సమీపంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. సదరు బాలిక తోటి విద్యార్థి(17)ని ఇష్టపడింది. అదే సమయంలో ఆ బాలికను ఇష్టపడుతున్న ఆమె మేనమామ కరణం సాయితేజ(24) పెళ్లి ప్రతిపాదనతో ఇక్కడకు వచ్చాడు. ఆ ప్రతిపాదనను బాలిక తిరస్కరించింది.

దీంతో సాయితేజ తీవ్ర అవమానభారంతో రగిలిపోయాడు. అదే సమయంలో బాలిక ఇష్టపడిన అబ్బాయి గురించి సాయితేజకు తెలిసింది. దీంతో గురువారం ఆ అబ్బాయి వద్దకు వెళ్లి నీతో మాట్లాడే పని ఉందంటూ తన కారు ఎక్కించుకున్నాడు. అప్పటికే కారులో ఉన్న మరో ఇద్దరు యువకులు ఆ అబ్బాయిని బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అతడిపై దాడి చేయడంతోపాటు సాయితేజ తన వద్ద ఉన్న పిస్టల్‌తో బెదిరించాడు.

అనంతరం నేరుగా బాలిక ఇంటికి అతడిని తీసుకువెళ్లి.. ఆమె తల్లి వద్ద పంచాయితీ పెట్టాడు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో సదరు బాలుడు చాకచక్యంగా తప్పించుకుని బయటకు పరుగు తీశాడు. సాయితేజ, అతడితో పాటు వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు ఆ అబ్బాయి వెంట పరుగులు తీశారు. భయాందోళకు గురైన అతడు నేరుగా పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్లాడు. ఇది గమనించిన సాయితేజతో పాటు మిగిలిన ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న ఏసీపీ స్వరూపారాణి, సీఐ వెంకునాయుడు, ఇతర పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అమ్మాయితో పాటు ఆమె తల్లిదండ్రులను విచారించారు. నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా ఏడాది క్రితం సదరు బాలిక పెళ్లి చేసుకోను అన్నందుకు ఆమెను సాయితేజ కిడ్నాప్‌ చేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో సాయితేజపై కిడ్నాప్‌ యత్నం కేసు నమోదైంది.  

మరిన్ని వార్తలు