అత్యాచారయత్నం.. బాలిక ప్రతిఘటన

11 Dec, 2019 01:38 IST|Sakshi

లిఫ్టు ఇస్తానని నమ్మించి ఓ యువకుడు అఘాయిత్యం..

సాక్షి, కోరుట్ల(జాగిత్యాల) : ‘ఎంత సేపు ఇక్కడ ఎదురుచూస్తరు.. నేను అటుదిక్కే పోతున్న.. మిమ్మల్ని మోటార్‌ సైకిల్‌ మీద రాయికల్‌లో దించుతా. భయపడకండి.. నిన్నమొన్ననే నలుగురిని కాల్చి సంపిండ్రు.. నేను అలాంటోడిని కాదని’.. ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలను నమ్మబలికాడు. గుట్టల వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి విఫలయత్నం చేశాడు. ఓ అమ్మాయి ప్రతిఘటించి రాళ్లతో దాడి చేయగా.. బంగారు చైన్‌ లాక్కొని పరారయ్యాడు.

ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం రామారావుపల్లెకు చెందిన డిగ్రీ విద్యార్థిని (17), 8వ తరగతి విద్యార్థిని (14) రాయికల్‌ వెళ్లడానికి సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని బస్టాప్‌ వద్ద ఉన్నారు. అటు నుంచి మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెకు చెందిన కుంచం వేణు వారిని చూసి, తాను రాయికల్‌ వెళ్తున్నానని, మిమ్మల్ని దింపుతానని పిలిచాడు.

అతడి మోటార్‌ సైకిల్‌పై వెళ్లేందుకు వారిద్దరూ కొంత సందేహించినా నమ్మించాడు. ఇద్దరిని బైక్‌పై ఎక్కించుకొని కోరుట్ల మండలం కల్లూర్‌ మోడల్‌ స్కూల్‌ వెనుక భాగంలో ఉన్న అయిలాపూర్‌ గుట్టల వద్దకు తీసుకెళ్లగా, తమను ఎక్కడికి తీసుకెళ్తున్నావని బాలికలు అడిగితే, పొలం దగ్గర నీళ్ల మోటారు ఆన్‌ చేసి వెళ్దామని చెప్పాడు. అయిలాపూర్‌ గుట్టల సమీపంలో ఇద్దరినీ బెదిరించి అత్యాచారానికి విఫలయత్నం చేశాడు.  

తెగువ చూపిన చిన్నారి 
కుంచం వేణు తమపై అకృత్యానికి పాల్పడే అవకాశం ఉందన్న భయంతో ఓ బాలిక (14) కేకలు వేస్తూ ప్రతిఘటించింది. వేణుపై రాళ్లతో దాడి చేసింది. దీంతో భయపడిన వేణు.. డిగ్రీ విద్యార్థిని మెడలో ఉన్న 10 గ్రామలు బంగారు చైన్‌ లాక్కొని పరారయ్యాడు. విషయాన్ని అమ్మాయిలు ఫోన్‌ ద్వారా తమ తల్లిదండ్రులకు తెలిపినట్లు సమాచారం. దీంతో కోరుట్ల పోలీసులు నిందితుడి కోసం గాలించారు. అతడి వివరాలను ఇటిక్యాల గ్రామంలోని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు కనిపెట్టారు. నిందితుడిపై ఫోక్సో యాక్టుతోపాటు సెక్షన్లు 363, 54, 392, 323, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.  

మరిన్ని వార్తలు