పాలమూరు జైలుకు నవీన్‌రెడ్డి

8 Sep, 2019 08:55 IST|Sakshi

సాక్షి, జడ్చర్ల: బాలికను దారుణంగా హత్య చేసిన నిందితుడు నవీన్‌రెడ్డిని శనివారం పోలీసులు జడ్చర్ల కోర్టులో హాజరుపరిచారు. గత నెల 27న హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన బాలికను కారులో ఎక్కించుకుని శంకరాయపల్లితండాకు వెళ్లే దారికి కొద్దిదూరంలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల తర్వాత 29న నిందితుడు వినియోగించిన కారు ఆధారంగా విచారించిన పోలీసులు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కోహెడకు చెందిన నిందితుడు నవీన్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా బాలిక హత్య విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు నిందితుడు నవీన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

అయితే మరోసారి సమగ్ర విచారణ చేసేందుకు కేసులో కావాల్సిన ముఖ్యమైన ఆధారాల సేకరణకు ఈ నెల 4న నవీన్‌రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో హత్య చేసే రోజు నిందితుడు వినియోగించిన కారు, దుస్తులు, సెల్‌ఫోన్, చేతికి ధరించిన వస్తువులు తదితర వాటిని స్వాధీనపరుచుకున్నారు. ఆ రోజు ఏం జరిగింది, హత్య చేసేందుకు గల కీలక కారణం ఏమిటి తదితర వివరాలను సేకరించారు. శనివారం పోలీస్‌ కస్టడీ ముగియడంతో నిందితుడు నవీన్‌రెడ్డిని కోర్టులో హాజరుపరిచి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. 

భారీ బందోబస్తు మధ్య.. 
నిందితుడు నవీన్‌రెడ్డిని కోర్టులో హాజరుపరిచే సమయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌ డీఎస్పీ భాస్కర్‌గౌడ్, సీఐ ఆదిరెడ్డి తదితరులు కోర్టు దగ్గర బందోబస్తు పర్యవేక్షించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచేటప్పుడు, తిరిగి రిమాండ్‌కు తరలించే సమయంలో అతనిని బయటకు కనిపించకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే నవీన్‌రెడ్డిని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువచ్చారన్న సమాచారంతో స్థానికులు దాడి చేసే ప్రమాదం ఉందన్న సమాచారంతో మహబూబ్‌నగర్‌లోని జైలుకు తరలించే క్రమంలో కూడా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మరో దారిలో తరలించినట్లు సమాచారం. కస్టడీకి తీసుకుని విచారించిన అనంతరం కోర్టులో హాజరుపరిచి కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.  ఇది చదవండి : ఫేస్‌బుక్‌ మర్డర్‌

మరిన్ని వార్తలు