మాట వినలేదని.. క్రికెటర్‌కు కత్తిపోట్లు!

7 Feb, 2018 14:06 IST|Sakshi

కేవలం స్కూలు తరపునే ఆడాలన్న పీఈటీ

ప్రైవేట్ క్లబ్‌కు ఆడటంతో విద్యార్థిపై కత్తితో దాడి!

సాక్షి, చెన్నై: తాను చెప్పినట్లు చేయలేదని ఓ జూనియర్ లెవల్ క్రికెటర్‌పై స్కూల్‌ టీచరే కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆ బాధిత విద్యార్థి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తమిళనాడు దిండిగల్ జిల్లా మనవాడిలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకెళ్తే.. దిండిగల్ జిల్లా పాయలానికి చెందిన హదికర్ రహ్మాన్(16) మనవాడిలోని ఆశ్రమ్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఇంటర్‌ ఫస్టియర్ చదువుతున్నాడు. అదే స్కూల్లో పన్నీర్‌సెల్వం ఫిజికల్ ఎడ్యూకేషన్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. స్కూలు తరఫున క్రికెట్ ఆడే రహ్మాన్.. ప్రైవేట్ క్లబ్‌ టోర్నీల్లోనూ పాల్గొనేవాడు. కేవలం మన స్కూలు, మన ప్రాంతం తరఫున మాత్రమే క్రికెట్ ఆడాలని.. ప్రైవేట్‌ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించొద్దని రహ్మాన్‌కు పీఈటీ వార్నింగ్ ఇచ్చాడు. కానీ రహ్మాన్ ప్రైవేట్ టోర్నీల్లోనూ పాల్గొనడంతో తీవ్ర ఆవేశానికి లోనైన పీఈటీ పన్నీర్‌సెల్వం మాట్లాడాలంటూ పిలిచాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో క్రికెటర్ రహ్మాన్‌ ఛాతీ, భుజం భాగాల్లో పొడిచాడు.

చేతిలోని కత్తిని ఇతర టీచర్లు గుంజుకోగానే పీఈటీ పన్నీర్‌సెల్వం అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, తీవ్రంగా రక్తస్రావమవుతున్న విద్యార్థి రహ్మాన్‌ను కరూర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనను తానే గాయపర్చుకుని పీఈటీ సైతం ఆస్పత్రిలో చేరి విద్యార్థి తనపై దాడి చేశాడని చెప్పడం గమనార్హం. స్కూలు యాజమాన్యం ఫిర్యాదు మేరకు పన్నీర్‌సెల్వంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు