వ్యాయామ ఉపాధ్యాయుడి హత్య!

18 Oct, 2019 13:05 IST|Sakshi
కాటి నాగరాజు, పీఈటీ (ఫైల్‌)

బంగారం, నగదు మాయంపై అనుమానాలు

అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు

ఏలూరు టౌన్‌: ఏలూరు అశోక్‌నగర్‌లోని కేపీడీటీ ఉన్నత పాఠశాలలో వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాటి నాగరాజు హత్య ఉదంతం ఏలూరు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి..  ఏలూరు రూరల్‌ మండలం లింగారావుగూడానికి చెందిన కాటి నాగరాజు (48) ఏలూరు అశోక్‌నగర్‌లోని కేపీడీటీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పిల్లల చదువుల నిమిత్తం కొంతకాలంగా సత్రంపాడులో నివాసముంటున్నారు. ఇటీవల సొంతూరిలో ఇంటిని నిర్మించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో బుధవారం సాయంత్రం రూ.2 లక్షల నగదు, నాలుగున్నర కాసుల బంగారు ఆభరణాలు తీసుకుని మోటారు సైకిల్‌పై  బయలుదేరారు. బంగారు ఆభరణాలు ఎందుకు తీసుకువెళుతున్నారని తాను అడిగితే ఎల్‌ఐసీ వాళ్లు స్కాన్‌ చేసుకుని ఇస్తారని చెప్పి తీసుకువెళ్లినట్లు అతడి భార్య చెబుతోంది.

అదేరోజు రాత్రి వట్లూరు పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలో రోడ్డు పక్కన నాగరాజు అచేతనంగా పడి ఉన్నారు. అటుగా విజయవాడ నుంచి వస్తున్న ఓ కానిస్టేబుల్‌ ఆయన్ను గమనించారు. నాగరాజుతో పరిచయం ఉండటంతో విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు. కుటుంబసభ్యుల సాయంతో నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే నాగరాజు మృతిచెందినట్టు నిర్ధారించారు. ఆయన హత్య చేసి ఎవరైనా సొత్తు అపహరించుకుపోయారా లేక అనారోగ్యంతో ఆయన మృతి చెందారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసిన త్రీటౌన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొలుత నాగరాజు గుండెపోటులో మృతిచెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. మృతదేహాన్ని స్వగృహానికి తీసుకువెళ్లగా నగదు, నగలు ఆయన వద్ద లేకపోవటాన్ని గుర్తించి ఎవరైనా హత్యచేసి ఉంటారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మిస్టరీగా మృతి
వ్యాయామోపాధ్యాయుడు నాగరాజు మృతి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మృతుని శరీరంæపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెబుతున్నారు. ఏవిధంగా ఆయన చనిపోయాడు? అనారోగ్యంతోనా.. లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా ? ఆయన వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు ఎలా మాయమయ్యాయి అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యంతో రోడ్డు పక్కన పడి ఉన్న అతని వద్ద నుంచి ఎవరైనా నగదు, నగలు మాయం చేశారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేక  హత్య చేసి దుండగులు దోచుకుపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కుటుంబసభ్యులు మాత్రం నాగరాజును చంపి ఎవరో నగదు, నగలు ఎత్తుకుపోయారని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాసరావు గురువారం తన సిబ్బందితో లింగారావుగూడెం  వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం  ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించటంతో స్వగ్రామానికి తరలించారు. మృతుడి అన్న పెదపాడులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తమ్ముడు విజయవాడలో సీబీసీఐడీ విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు