ప్రేమోన్మాది చేతిలో గాయపడిన రవళి మృతి

5 Mar, 2019 02:36 IST|Sakshi

మృత్యువుతో పోరాడి ఓడిన యువతి

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి ఆరు రోజుల నుంచి సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవళి (22) సోమవారం సాయంత్రం మృతి చెందింది. పెట్రోల్‌ దాడిలో గాయపడిన బాధితురాలిని చికిత్స కోసం ఫిబ్రవరి 27న ఆస్పత్రిలో చేర్చారు. పెట్రోల్‌ మంటలకు శరీరంలో 70 శాతం కాలిపోయింది. కంటిచూపు దెబ్బతింది. రక్తనాళాలు సహా పలు అంతర్గత అవయవాలు పాడయ్యాయి. ఊపిరితిత్తుల్లో పొగబారి ఉబ్బిపోయాయి. శ్వాస తీసు కోవడం కష్టంగా మారడంతో ఆమెను గత ఆరు రోజుల నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించినా ఫలి తం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం అప్పగిస్తామని అధికారులు చెప్పినట్లు రవళి బంధువులు తెలిపారు.  

ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడి..
వరంగల్‌జిల్లా రూరల్‌ సంగెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన తోపుచర్ల పద్మ, సుధాకర్‌రావుల కుమార్తె రవళి. హన్మకొండ రాంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ ఫైనలియర్‌ చదువుతోంది. కాలేజీకి సమీపంలోని ఓ హాస్టల్‌లో ఉండి చదువుకుంటుంది. ఫిబ్రవరి 27న హాస్టల్‌ నుంచి స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్తుండగా, అదే కాలేజీలో బీకాం ఫైనలియర్‌ చదువుతున్న పెండ్యాల సాయి అన్వేష్‌ (24) ఆమెను అడ్డగించి, తనను ప్రేమించాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో అప్పటికే వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను రవళిపై పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం రవళిని తొలుత వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించారు. గత ఆరు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ విషయం తెలిసి ఆమె బంధువులు, మహిళా సంఘాల ప్రతినిధులు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు. అన్వేష్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు