పీహెచ్‌సీలో ప్రసవానికి వైద్యుల నిరాకరణ

18 Apr, 2018 08:29 IST|Sakshi
ఇంటి వద్దే ప్రసవం జరిగి పుట్టిన చిన్నారి, పక్కనే బాలింత, ఆమె తల్లి

ఇంటి వద్దే ప్రసవం

అపస్మారక స్థితిలో బాలింత 

కొయ్యలగూడెం : ప్రసవం కోసం పీహెచ్‌సీకి వెళ్లిన గర్భిణికి పురుడు పోసేందుకు వైద్యులు నిరాకరించిన ఘటన ఇది. దీంతో ఆమె ఇంటిలోనే ప్రసవించి అపస్మారకస్థితికి చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

పాతపరింపూడిలోని మారుమూల నివసిస్తున్న యడ్లపల్లి వెంకటలక్ష్మికి మూడో కాన్పుకు పురుడు పోసుకోవడానికి 15వ తేదీ కొయ్యలగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు.

అయితే పురుడు పోయడానికి వైద్యులు నిరాకరించారని, ఆసుపత్రిలో చేర్చుకోకుండానే పరీక్షలు నిర్వహించి ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా పంపించి వేసినట్టు భర్త వెంకన్న తెలిపాడు.

దీంతో ఇంటికి తీసుకుని రాగా మంగళవారం ఉదయం వెంకట లక్ష్మికి పురిటినొప్పులు ఎక్కువై డెలివరీ అయ్యిందని, పాప పుట్టిన కొద్ది నిమిషాలకే వెంకటలక్ష్మి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని వెంకన్న విలపించాడు

స్థానిక ప్రైవేట్‌ వైద్యులు వెంకట లక్ష్మిని పరిశీలించి వెంటనే రాజమండ్రి తరలించాల్సిందిగా పేర్కొన్నారని, గంగిరెద్దులతో యాచక వృత్తి కొనసాగించే తనకు ఆర్థికస్థోమత లేదని వాపోయాడు. 16వ తేదీ వచ్చిన భారీ వానకు పూరింటిలోకి నీరు చేరిందని, పురుడు పోసుకోవడానికి తన భార్యను పడుకోబెట్టడానికి సరైన ప్రదేశం లేకపోయిందని తెలిపాడు.

ఇరుగుపొరుగు మహిళలు కష్టం మీద ఆమెకు పురుడు పోశారని తెలిపాడు. స్థానికుల సహాయంతో వెంకటలక్ష్మిని రాజమండ్రికి తరలించారు. దీనిపై వైద్యారోగ్య శాఖ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారెవరూ అందుబాటులో లేరు. 

మరిన్ని వార్తలు