అవినీతి రోగం కుదిరింది!

9 Jun, 2020 07:54 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న రూ.19 వేల నగదు - ఏసీబీ అధికారులను ఆశ్రయించిన ఏఎన్‌ఎంలు

రూ.19 వేలు లంచం తీసుకుంటూ 

పట్టుబడిన పీహెచ్‌సీ యూడీసీ  

విసిగిపోయి  ఏసీబీకి సమాచారమిచ్చిన ఏఎన్‌ఎంలు

ఏజెన్సీలో కలకలం 

పాడేరు: మండలానికి ప్రధాన ఆరోగ్య కేంద్రమైన మినుములూరు పీహెచ్‌సీలో యూడీసీ (సీనియర్‌ అసిస్టెంట్‌) శోభారాణి అవినీతిని ఇద్దరు ఏఎన్‌ఎంలు బట్టబయలు చేసి ఏసీబీ అధికారులకు పట్టించారు. ఆమె అవినీతి బాగోతంతో విసిగిపోయిన  ఏఎన్‌ఎంలు ఏసీబీని ఆశ్రయించడంతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.   సోమవారం ఉదయాన్నే విశాఖ ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ షకీలా భాను, డీఎస్పీ గంగరాజు, ఇతర సీఐలు, సిబ్బంది అంతా  మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. ఆ సమయంలో  తన గదిలో విధులు నిర్వహిస్తున్న యూడీసీ శోభారాణికి ఇద్దరు ఏఎన్‌ఎంలు పుష్పవతి, భాగ్యవతిలు రూ.19వేల నగదును లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.  అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఆరోగ్య కేంద్రం ప్రాంగణం ఒక్కసారిగా ఏసీబీ దాడులతో ఉలిక్కిపడింది. గత ఏడాది నుంచి యూడీసీ శోభారాణి అవినీతి అక్రమాలపై ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు వైద్య సిబ్బంది చేపడుతూనే ఉన్నారు.

ఇక్కడ వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, యూడీసీ శోభారాణి  తమను అన్ని విధాల ఇబ్బందులు పెడుతున్నారని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు ఏఎన్‌ఎంలు  యూడీసీ అవినీతి అక్రమాలపై ఇటీవల ఏసీబీ అధికారులను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న 11 మంది ఏఎన్‌ఎంలకు 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఫీల్డ్‌ ట్రావెలింగ్‌ అలవెన్సుల బిల్లులను ఇటీవల యూడీసీ శోభారాణి మంజూరు చేయించింది. ఏఎన్‌ఎంల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున ఎఫ్‌టీఏల సొమ్ము జమ అయింది. అయితే ఈ  సొమ్ములో ఒక్కొక్కరు రూ.7,500ల చొప్పున తనకు లంచం ఇవ్వాలని యూడీసీ  డిమాండ్‌ చేయడంతో కొంత మంది ఆమె అడిగిన సొమ్మును ఇచ్చారు. అయితే పుష్పవతి, భాగ్యవతి, మెటర్నటిలీవ్‌లో ఉన్న కె.భవానీ యూడీసీ అడిగినంత నగదును ఇచ్చేందుకు ఇష్టపడలేదు.

అంత పెద్దమొత్తంలో లంచాన్ని ఇవ్వలేమంటు పుష్పవతి, భాగ్యవతి  చెప్పడంతో కనీసం రూ.7వేలు చొప్పునైనా ఇవ్వాలని యూడీసీ పట్టుబట్టింది. అలాగే మెటర్నటి లీవ్‌లో ఉన్న భవాని కూడా ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా రూ.5వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది.  లంచం ఇవ్వడానికి ఇష్టపడని భాగ్యవతి, పుష్పవతిలు ఇటీవల ఏసీబీని ఆశ్రయించి యూడీసీ శోభారాణి నిత్యం చేస్తున్న అవినీతి అక్రమాలను అధికారులకు సమగ్రంగా విన్నవించారు. 

దీంతో వ్యూహం ప్రకారం ఏసీబీ అధికారులు సోమవారం మెరుపుదాడి చేసి ఏఎన్‌ఎంల  నుంచి లంచం  తీసుకుంటుండగా  పట్టుకున్నారు.  భాగ్యవతి, పుష్పవతి ఇచ్చిన రూ.14వేలు,   లీవ్‌లో ఉన్న కె.భవాని ఇచ్చిన రూ.5వేలు మొత్తం 19 వేలు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ గంగరాజు విలేకరులకు తెలిపారు. ఏసీబీ అధికారులు యూడీసీ గదిలోని అన్ని రికార్డులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇక్కడ వైద్యాధికారి, ఇతర వైద్య సిబ్బందిని విచారించారు. పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్, సీఐ ప్రేమ్‌కుమార్, ఇతర సిబ్బంది కూడా మినుములూరు ఆస్పత్రికి చేరుకుని ఏసీబీ అధికారులకు   సహకారం అందించారు. లంచం తీసుకున్న నేరం కింద యూడీసీ శోభారాణిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆమెకు మినుములూరు ఆస్పత్రిలోనే వైద్య సిబ్బంది కోవిడ్‌–19 పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలను కూడా జరిపిన అనంతరం  అరెస్టు చేసి విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకువెళ్లారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు