ఆపరేషన్‌ లాడ్జి

26 Mar, 2018 11:50 IST|Sakshi
ఓ లాడ్జీల్లో అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్న మూడో నగర పోలీసులు

అర్ధరాత్రి జిల్లా వ్యాప్తంగా 85 లాడ్జీల్లో తనిఖీలు  

  నెల్లూరు(క్రైమ్‌): లాడ్జీలపై పోలీసు నిఘా కొరవడింది. అసాంఘిక శక్తులు లాడ్జీల్లో మకాం వేసి నేరాలకు పాల్పడుతున్నట్లు పలు ఘటనలపై విచారణలో వెలుగుచూసింది. దీంతో జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ లాడ్జీ లపై దృష్టి సారించారు. క్రమం తప్పకుండా లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో శనివారం అర్ధరాత్రి జిల్లా వ్యాప్తం గా పోలీసులు తమ ప్రాంతాల్లోని లాడ్జీల్లో రెండు గంటల పాటు తనిఖీలు చేపట్టారు. నెల్లూరు నగరంలోని 40 లాడ్జీలు, నెల్లూరు రూరల్‌ పరిధిలో 11, గూడూరులో 15, కావలిలో 14, ఆత్మకూరులో 5 లాడ్జీల్లోని ప్రతి గదిని తనిఖీ చేశారు.

తనిఖీల్లో పలువురు అనుమానాస్పదంగా దొరకడంతో వారి పూర్తి వివరాలను సేకరించారు. నగరంలోని బాబుఐస్‌క్రీం సమీపంలో గల ఓ లాడ్జీల్లో పోలీసు తనిఖీల సందర్భంగా ఒక మహిళ, ఇద్దరు విటులు పోలీసులకు చిక్కారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ లాడ్జీల్లో దిగేవారి పూర్తి వివరాలను సేకరించి విధిగా ప్రతిరోజు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే పోలీస్‌స్టేషన్‌కు ఫోను చేసి తెలపాని చెప్పారు. తనిఖీల్లో నగరంలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నాు.

మరిన్ని వార్తలు