ఫోన్‌కాల్‌తో ఆగిన ఎమ్మెల్యే అరెస్ట్‌

12 Apr, 2018 11:56 IST|Sakshi
ఫోన్‌కాల్‌తో సెంగార్‌ అరెస్ట్‌ ఆగిందన్న బీజేపీ సీనియర్‌ నేత

సాక్షి, లక్నో : లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ను అరెస్ట్‌ చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ నిర్ణయానికి వచ్చినా పార్టీ ప్రముఖుడి నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌తో మనసు మార్చుకున్నారని బీజేపీ సీనియర్‌ నేత పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేయడంతో పాటు పార్టీ నుంచి బహిష్కరించేందుకు సీఎం నిర్ణయం తీసకున్నారని, ప్రముఖ నేత ఫోన్‌ కాల్‌తో ఆ నిర్ణయం వాయిదా పడిందని, దీని ప్రభావం పార్టీపై తప్పకుండా ఉంటుందని మాజీ మంత్రి, పార్టీ సీనియర్‌ నేత ఐపీ సింగ్‌ చెప్పారు. చట్టానికి లోబడి నడుచుకోకుంటే పాలక పార్టీ లేదా విపక్షమైనా మూల్యం చెల్లించుకోకుండా తప్పించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఉన్నావ్‌ లైంగిక దాడి, కస్టడీ మరణాలపై సీబీఐ విచారణతో పాటు ఎమ్మెల్యే సెంగార్‌పై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి ఐపీ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాదాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు లైంగిక దాడి ఆరోపణలు చేసిన బాధితురాలితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సెంగార్‌పై నార్కో పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన ఇదే యువతి కొన్నేళ్ల కిందట ఓ వ్యక్తిపై లైంగిక దాడి కేసు నమోదు చేసినట్టు తెలిసిందని సింగ్‌ చెప్పారు. అయితే తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ తోసిపుచ్చారు.

మరిన్ని వార్తలు