సామూహిక అత్యాచారం

5 Mar, 2020 05:25 IST|Sakshi
యువతిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన స్థలం

డిగ్రీ విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి 

స్నేహితుడిపై దాడిచేసి యువతిపై ముగ్గురు అత్యాచారం 

సహకరించిన మరో యువకుడు  

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఘటన 

మండపేట: స్నేహితులైన కాలేజీ విద్యార్థిని, విద్యార్థి ఒక చోట ఉండటాన్ని గమనించిన ముగ్గురు దుండగులు యువకుడిపై దాడిచేసి అనంతరం యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగింది. బాధిత యువతి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఇదీ జరిగింది.. 
మండపేట సమీప గ్రామానికి చెందిన దళిత యువతి పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. మంగళవారం కళాశాలకు చివరి రోజు కావడంతో స్నేహితులతో వీడ్కోలు వేడుకలు జరిగాయి. తర్వాత స్నేహితుడితో కలిసి బైపాస్‌ రోడ్డు సమీపంలోని పశువుల మకాం వద్ద మాట్లాడుతోంది. మకాం యజమాని వీరిపై కన్నేశాడు. తన స్నేహితుడైన కోడిపెంట వ్యాపారిని అక్కడికి పిలిచాడు. అతడి పాలేరుగా పనిచేసే మరో స్నేహితునికీ విషయం చెప్పాడు. ఇద్దరూ మరో యువకుడితో కలిసి మోటారు సైకిల్‌పై అక్కడికి వచ్చారు. నలుగురూ కలిసి యువతి స్నేహితుడిపై దాడిచేశారు. సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. అనంతరం ఆమె స్నేహితున్ని ఓ యువకుడు మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని సినిమా రోడ్డులోని పాన్‌షాప్‌ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ తన ఫోన్‌కు రీచార్జ్‌ చేయించుకుని వెళ్లిపోయాడు. మిగిలిన ముగ్గురు నిందితులూ యువతిపై అత్యాచారానికి పాల్పడి వెళ్లిపోయారు. మకాం యజమాని ఐదు పదుల వయస్సు దాటిన వ్యక్తి కాగా, మిగిలిన ఇద్దరూ 40 ఏళ్ల వారు.

నిందితులు పట్టుబడ్డారిలా..
పాన్‌ షాపు వద్ద ఉన్న బాధిత విద్యార్థి స్నేహితులకు సమాచారమిచ్చాడు. స్నేహితులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న యువతిని ఇంటికి చేర్చారు. పాన్‌షాప్‌ వద్ద రీచార్జ్‌ చేయించిన నంబర్‌ ఆధారంగా నిందితుల్లో ఒకడైన యువకుడిని గుర్తించారు. యువతి స్నేహితులు, బంధువులు గొల్లపుంతలోని అతని ఇంటికి వెళ్లి దేహశుద్ధి చేశారు. మిగిలిన ముగ్గురి పేర్లు అతను బయటపెట్టగా సంఘం కాలనీలోని ఇద్దరు నిందితుల ఇంటికి చేరుకుని వారినీ చితకబాదారు. ఈలోగా స్థానికులు 100 ఫోన్‌ చేయడంతో పోలీసులు వచ్చారు. ఈలోగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా