చోరీ సొమ్ముతో చోరులకు ఫైనాన్స్‌!

12 Oct, 2019 12:43 IST|Sakshi
నిందితుడు ధరమ్‌

ఘరానా దొంగ ధరమ్‌ వ్యవహారమిది

ఇప్పటి వరకు 25 కేసుల్లో నిందితుడు

రద్దీ బస్సులే టార్గెట్‌గా పిక్‌ పాకెటింగ్స్‌

పట్టుకున్న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌

సాక్షి, సిటీబ్యూరో: సిటీలో రద్దీగా ఉన్న ఆర్టీసీ బస్సులను టార్గెట్‌గా చేసుకుని, తన ముఠా సాయంతో బంగారు గొలుసులు, పర్సులను తస్కరించే ఘరానా దొంగ కేఎస్‌ ధరమ్‌ను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు అరెస్టైన ఇతడిపై ఇప్పటి వరకు 25 కేసులు ఉన్నాయని, తాజాగా ఎనిమిది కేసుల్లో అరెస్టు చేసినట్లు అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ శుక్రవారం వెల్లడించారు. ధరమ్‌ ముఠా ప్రధానంగా మూడు రూట్లలో తిరిగే బస్సుల్లో, అదీ వెనుక డోర్‌ నుంచి దిగే ప్రయాణికుల్నే ఎంచుకుని పంజా విసురుతారన్నారు. ఇలా వచ్చిన సొత్తును విక్రయించగా వచ్చిన సొమ్ముతో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దొంగలకు ఫైనాన్స్‌ చేస్తాడని తెలిపారు. అఫ్జల్‌సాగర్‌ (మాన్గార్‌బస్తీ) ప్రాంతానికి చెందిన ధరమ్‌ వృత్తిరీత్యా  కూలీ.  కొన్నేళ్ళుగా ఏడెనిమిది మందితో ముఠా ఏర్పాటు చేశాడు. వీరు 8 ఏ, 8 ఎం, 2 జే రూట్లలో తిరిగే రద్దీ బస్సుల్నే టార్గెట్‌గా చేసుకుంటారు. ఏ సందర్భంలో బస్టాప్‌లో బస్సు ఎక్కడం, దిగడం చేయరు. సిగ్నల్స్‌ వద్ద, బస్సులు స్లోగా నడిచే ప్రాంతాల్లోనే బస్సు ఎక్కుతారు. బస్సు వెనుక డోర్‌ వద్ద నిల్చున్న వారిలో ఎక్కువగా వృద్ధుల్ని టార్గెట్‌గా చేసుకుంటారు. వారి చుట్టూ చేరే ఈ ముఠా సభ్యులు హల్‌చల్‌ చేస్తూ ఒత్తిడి కలిగిస్తారు. అదును చూసుకుని వారి మెడలో ఉన్న గొలుసు కత్తిరించడం లేదా జేబులో ఉన్న డబ్బు, పర్సు చోరీ చేసేస్తారు.

పని పూర్తయిన వెంటనే ఆ సొత్తు/సొమ్ముతో ఓ ముఠా సభ్యుడు బస్సు దిగేస్తాడు. కాస్త తేడాతో మిగిలిన వారూ బస్సు దిగిపోతారు. అయితే ఏ సందర్భంలోనూ వీళ్ళు స్టాప్‌ వచ్చే వరకు ఆగి దిగరు. ఇలా వచ్చిన సొత్తును విక్రయించగా వచ్చిన సొమ్ముతో ఎక్కువ భాగం తీసుకునే గ్యాంగ్‌ లీడర్‌ ధరమ్‌ మిగిలిన మొత్తం సభ్యులకు పంచుతాడు. తన వాటాగా వచ్చిన సొమ్ముతో అఫ్జల్‌సాగర్‌ కేంద్రంగా ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఆ ప్రాంతంతో పాటు పలు ప్రాంతాలకు చెందిన చోరులతో ఇతడికి సంబంధాలు ఉన్నాయి. వారు చోరీ చేసుకు వచ్చిన సొత్తును తాకట్టు పెట్టుకుని డబ్బు ఇస్తుంటాడు. రూ.30 వేల సొత్తుకు కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చి 3 నుంచి 20 శాతం వరకు వడ్డీగా వసూలు చేస్తాడు. గతంలో సుల్తాన్‌బజార్, షాహినాయత్‌గంజ్‌ తదితర ఠాణాల్లో ఇతడిపై 25 కేసులు నమోదయ్యాయి. 2014 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన అతను ఆ సమయంలో గ్యాంగ్‌తో కలిసి అనేక చోరీలు చేశాడు. అయితే బహదూర్‌పుర, కంచన్‌బాగ్, బేగంబజార్, హుయామున్‌నగర్, నాంపల్లి ఠాణాల్లో 8 కేసులు మాత్రం నమోదయ్యాయి. సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ థక్రుద్దీన్‌లతో ఏర్పడిన బృందం శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకుంది. ఇతడి నుంచి రూ.4.15 లక్షల విలువైన బంగారం, నగదు  స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని కంచన్‌బాగ్‌ పోలీసులకు అప్పగించారు. ఇతడి ముఠా సభ్యులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే కోణాల్లో ఆరా తీస్తు వారి కోసం గాలిస్తున్నారు. ధరమ్‌ నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో అతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలని నిర్ణయించినట్లు అదనపు డీసీపీ తెలిపారు. 

మరిన్ని వార్తలు