బ్లేడ్‌బాబ్జీ.. ఈ దొంగోడు.. చో'రిచ్‌'

25 Dec, 2019 07:28 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న రైల్వే ఎస్పీ డాక్టర్‌ అనురాధ తదితరులు

గేటెడ్‌ కమ్యూనిటీ ఫ్లాటులో జీవనం

అద్దె నెలకు రూ.30 వేలు

పిల్లల స్కూల్‌ ఫీజులు రూ.లక్షల్లో చెల్లింపులు

భార్యకు కిలో బంగారు ఆభరణాలు

ఓ పిక్‌పాకెటర్‌ జల్సా జీవితం

అరెస్టు చేసి..అవాక్కయిన పోలీసులు

అతని పేరు థానేదార్‌సింగ్‌ కుశ్వ అలియాస్‌ రాజు (33). చందానగర్‌లోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో లగ్జరీ ఫ్లాట్‌లో జీవనం. నెలకు రూ.30 వేలు అద్దె. ఇద్దరు పిల్లలకు రూ.లక్షలు ఫీజు చెల్లించి ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో విద్యాభ్యాసం. భార్యకు కిలోకు పైన బంగారు ఆభరణాలు. లెక్కలేనన్ని ఆస్తులు. ఇంతకీ ఈ థానేదార్‌సింగ్‌ కుశ్వ వృత్తి..ప్రవృత్తి ఏంటో తెలుసా. దొంగతనాలు(పిక్‌పాకెటర్‌). అవును మీరు చదువుతున్నది నిజమే. రైళ్లలో రాత్రి వేళల్లో మాత్రమే కూల్‌గా బ్లేడునే ఆయుధంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కుశ్వ ఇప్పటికి 400 నేరాలకు పాల్పడి రూ.కోట్లు మూటగట్టుకున్నాడు. సట్టా జూదం, క్రికెట్‌ బెట్టింగ్‌ల్లోనూ పాల్గొన్నాడు. చోరీ సొమ్ముతో జల్సా జీవితం గడుపుతున్నాడు. ఇటీవల తనకు తానే ఓ ఘటనలో ఇరుక్కుని బేగంపేట రైల్వే స్టేషన్‌ వద్ద రైల్వే పోలీసులకు చిక్కాడు. అతని నేర చరిత్ర..విలాసవంతమైన జీవనం గురించి తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడి నుంచి రూ.13 లక్షల నగదు, 668 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 

సికింద్రాబాద్‌: బ్లేడ్‌ను ఆయుధంగా చేసుకుని రైళ్లలో  దొంగతనాలకు పాల్పడుతూ రూ.కోట్లు కూడగట్టుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఓ ఘరానా చోరుడిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. కూల్‌గా చోరీలు చేస్తూ..ఎవరికీ అనుమానం రాకుండా గేటెడ్‌ కమ్యూనిటీలోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్న ఇతడి చరిత్రను తెలుసుకున్న పోలీసులే అవాక్కయ్యారు. మంగళవారం సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ డాక్టర్‌ అనురాధ వివరాలు వెల్లడించారు

యూపీ నుంచి వచ్చి...
ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం, అలీఘడ్‌ జిల్లా, అర్ణి గ్రామానికి చెందిన థానేదార్‌సింగ్‌ కుశ్వ అలియాస్‌ రాజు (33) చిన్నతనం నుంచే నేరాలకు అలవాటు పడ్డాడు. 2004లో అతను బతుకుదెరువు నిమిత్తం తన స్నేహితుడు రామ్‌ స్వరూప్‌తో కలిసి పూణే వెళ్లాడు. మొదట్లో రైల్వే ఫ్లాట్‌ఫాంలపై స్వీట్లు, తదితర వస్తువులు విక్రయించేవాడు. ఆ తర్వాత అదే ప్రాంతంలో సిగరెట్లు, తంబాకు విక్రయానికి శ్రీకారం చుట్టాడు. ఈ నేపథ్యంలో పలువురు దొంగలు పిక్‌ప్యాకెటింగ్‌లు, చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతుండటాన్ని గుర్తించిన కుశ్వ వాటి పట్ల ఆకర్శితుడయ్యాడు. అయితే అప్పటికే విలాసవంతమైన జీవితం గడపాలని భావిస్తున్న కుశ్వ రైళ్లలో చోరీకి పాల్పడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో 2006లో పూణే నుంచి సికింద్రాబాద్‌ వస్తుండగా రైల్లో వికారాబాద్‌కు చెందిన  పిక్‌పాకెటర్‌ చంద్రకాంత్‌తో పరిచయం ఏర్పడింది. చంద్రకాంత్‌ బ్లేడ్‌తో జేబులను కత్తిరించడంలో సిద్ధహస్తుడు. అతడి శిక్షణలో రాటుదేలిన కుశ్వ అప్పటి నుంచి రైళ్లల్లో ప్రయాణిస్తూ పిక్‌పాకెటింగ్‌లు, చైన్‌స్నాచింగ్‌లకు తెగబడుతున్నాడు. ఈ క్రమంలో 2007లో బంజారాహిల్స్‌లోని ఓ లాడ్జిలో బస చేసి ఉండగా అదే సమయంలో తనిఖీలకు వెళ్లిన పోలీసులపై దాడి చేసి పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 15 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న అతను జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం వికారాబాద్‌ వెళ్లి చంద్రకాంత్‌ గ్యాంగ్‌తో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్న కుశ్వకు అరుణ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఓ ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడేవారు. కొద్ది మొత్తం సంపాదించిన అనంతరం తన స్వగ్రామానికి వెళ్లిన అతను ఆగ్రాలో ఓ ఫ్లాట్‌ కొనుగోలు చేశాడు. 2009లో వివాహం చేసుకున్న అనంతరం మళ్లీ నగరానికి తిరిగివచ్చాడు. అయితే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో సట్టా, బెట్టింగ్‌లకు పాల్పడేవాడు.

నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లే టార్గెట్‌...
నగరంలోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్లను అడ్డాలుగా మార్చుకున్న థానేదార్‌సింగ్‌ కుశ్వ అలియాస్‌ రాజు రాత్రి వేళల్లో వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను టార్గెట్‌ చేసుకునేవాడు.  రైలులోని అన్ని బోగీల్లో కలియదిరుగుతూ ప్రయాణికులను ముందే టార్గెట్‌ చేసుకునేవాడు. అర్థరాత్రి దాటాక వారు ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో తనపని పూర్తి చేసుకుని ఆ తరువాతి స్టేషన్‌లో దిగిపోయేవాడు. యూపీ, మహారాష్ట్ర పోలీసులు గతంలో అతడిని అరెస్టు చేసి ఎరవాడ జైలుకు తరలించారు. కాగా ఉగ్రవాది కసబ్‌ను ఉరితీసిన సమయంలో కుశ్వ కూడా అదే జైలులో ఉండటం గమనార్హం. అక్కడి నుంచి విడులైన తర్వాత ఆగ్రాకు మకాం మార్చిన అతను క్రికెట్‌ బుకీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. 2014లో భార్యతో కలిసి హైదరాబాద్‌ వచ్చిన అతను చందానగర్‌ ప్రాంతంలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అదే సమయంలో తన గ్యాంగ్‌తో కలిసి దొంగతనం చేసే క్రమంలో ఔరంగాబాద్‌ పోలీసులపై బ్లేడ్‌తో దాడి చేసి అక్కడినుంచి పరారై నేరుగా ఆగ్రా చేరుకున్నాడు. అప్పటి నుంచి పలు నేరాలకు పాల్పడిన కుశ్వ సోమవారం తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డాడు. 

400 పైగా నేరాలు...
ఇప్పటి వరకు 400పైగా నేరాలకు పాల్పడినట్లు  థానేదార్‌సింగ్‌ కుశ్వ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ నేరాలన్నీ కేవలం రైళ్లలో చేసినవే కావడం గమనార్హం. ఆయా చోరీల్లో నిందితుడు రూ.2 కోట్ల వరకు నగదు, ఆభరణాలు దొంగిలించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతడి నుంచి రూ.13 లక్షల నగదు, 668 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

సట్టా... బెట్టింగులు....
చోరీల ద్వారా పెద్దమొత్తంలో డబ్బు కూడగట్టుకున్న థానేదార్‌సింగ్‌ కుశ్వ రూ. లక్షలు సట్టా ఆటకు, క్రికెట్‌ బెట్టింగ్‌లకు వినియోగించినట్లు విచారణలో వెల్లడైంది. ఇటీవలే అతను ఎనిమిది మంది క్రికెట్‌ బుకీలకు రూ. 17 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. తన భార్యకు సంబందించిన కిలో బంగారు ఆభరణాలు ఆగ్రాలోని ఒక వ్యాపారి వద్ద ఉంచినట్లు వెల్లడైంది. 

పట్టుబడిందిలా..
నవంబర్‌ 26న బేగంపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో నిలుచున్న థానేదార్‌సింగ్‌ కుశ్వపై అనుమానంతో ఆర్‌పీఎఫ్‌ పోలీసులు అతడిని పట్టుకునేందుకు వెళ్లగా ఓ కానిస్టేబుల్‌పై బ్లేడ్‌తో దాడిచేసిన కుశ్వ బైక్‌ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడటంతో ఎడమచేయి ఎముక విరిగింది. నెల రోజులుగా రైల్వేస్టేషన్‌ సమీపంలో వదిలేసిన బైక్‌ను అక్కడే ఉంచిన పోలీసులు నిఘావేసి ఉంచారు. ఇటీవల కోలుకున్న కుశ్వ ఈ నెల 23న మరోవ్యక్తి సహాయంతో బైక్‌ తీసుకెళ్లేందుకు బేగంపేట రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. ఈ క్రమంలో కుశ్వ పోలీసులకు పట్టుబడగా, సహాయకుడిగా వచ్చిన మరో వ్యక్తి పరారైనట్లు పోలీసులు తెలిపారు. కాగా సదరు హోండా యాక్టివా కూడా దొంగిలించిన వాహనంగానే పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

పీడీ యాక్టు నమోదు..
నిందితుడి పేరిట పలు ఆస్తులు ఉన్నాయని, వివిధ రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లు ఎస్పీ డాక్టర్‌ అనురాధ తెలిపారు. అతడిపై పీడీ యాక్టు ప్రయోగిస్తున్నామని త్వరలో కస్టడీకి తీసుకుని పూర్తి వివరాలు రాబడతామన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పెద్దమొత్తంలో రికవరీ చేసిన జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, కే.ఆదిరెడ్డి,  వెంకటరాములు , ఎస్‌ఐ బి.ప్రమోద్‌కుమార్‌లను రైల్వే పోలీస్‌ అధికారులు అభినందించారు. సమావేశంలో ఆర్‌పీఎఫ్‌ చీఫ్‌ సెక్యురిటీ కమిషనర్‌ ఆర్‌.రామకృష్ణ, రైల్వే డీఎస్‌పీలు ఎస్‌.రాజేంద్రప్రసాద్, ఎం.శ్రీనివాస్‌రావు, ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాణయ్య పాల్గొన్నారు.

విలాసవంతమైన జీవితం....
నిందితుడు థానేదార్‌సింగ్‌ కుశ్వకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చందానగర్‌లోని గేటెడ్‌ కమ్యునిటీలోని విలాసవంతమైన మై హోం జెవెల్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఇతను సదరు ఫ్లాట్‌కు నెలకు రూ.30 వేలు  అద్దె చెల్లిస్తున్నాడు. తన కుమార్తె, కుమారుడిని ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదివిస్తున్నాడు. ఇందుకుగాను రూ. లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నాడు.

>
మరిన్ని వార్తలు