తుపాకుల ముఠా అరెస్ట్‌

12 Jul, 2019 10:00 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీపీ విశ్వనాథ రవీందర్‌

 అక్రమ వసూళ్ల కోసం సరఫరా చేస్తున్న వైనం

మధ్యప్రదేశ్‌లో కొనుగోలు చేసి ఇక్కడ అమ్మడానికి యత్నాలు

సాక్షి, వరంగల్‌ క్రైం: అక్రమ వసూళ్ల కోసం తుపాకులు సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ తెలిపారు. గురువారం కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూళ్లకు పాల్పడే ముఠాకు తుపాకులను రవాణా చేసే సభ్యులను టాస్క్‌ఫోర్స్, దుగ్గొండి, గీసుగొండ పోలీసులు అరెస్టు చేసినట్లు  తెలిపారు. నిందితుల నుంచి రెండు 9 ఎంఎం పిస్తోళ్లు, ఆరు బులెట్లు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ముఠాగా ఏర్పాడి..
ప్రధాన నిందితుడు జన్ను కోటి న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన సానుభూతిపరుడిగా వ్యవహారిస్తూ గతంలో ప్రజా ప్రతిఘటనలో పనిచేసిన వాయినాల రవి, మరో నిందితుడు సంతోష్‌తో కలిసి మధ్యప్రదేశ్‌లో తుపాకులు కొనుగోలు చేసి ఇక్కడ విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిపారు. గతంలో న్యూడెమోక్రసీలో పనిచేసిన అబ్బర్ల రాజయ్య, మొగిళి ప్రతాప్‌రెడ్డిలు తుపాకీతో బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడేందుకు జన్ను కోటితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు.

కొనుగోలు చేసిన తుపాకీని రాజయ్య, ప్రతాప్‌రెడ్డిలకు విక్రయించేందుకు గురువారం ఉదయం దుగ్గొండి మండలం గిర్నిబాయి ప్రాంతంలో టేకు ప్లాంటేషన్‌కు వచ్చినట్లుగా టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ చక్రవర్తికి సమాచారం అందడంతో ఇన్స్‌పెక్టర్‌ రమేష్‌కుమార్, ఇన్స్‌పెక్టర్‌ డేవిడ్‌రాజ్, దుగ్గొండి సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ సాంబమూర్తి తమ సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా ఒక తుపాకీ, రెండు రౌండ్లు లభ్యమయ్యాయి. నిందితులు ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడు మల్లికార్జున్‌ను అరెస్టు చేసి ఒక తుపాకీ, నాలుగు రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. పూర్తి సమాచా రం కోసం దర్యప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

అధికారులకు అభినందనలు
నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌ జోన్‌ డీసీపీ నాగరాజు, ఏసీపీలు చక్రవర్తి, సునీతామోహన్, ఇన్స్‌పెక్టర్లు రమేష్‌కుమార్, సతీష్‌బాబు, సంజీవ్‌రావు, డేవిడ్‌రాజు, దుగ్గొండి సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ సాంబమూర్తి, టాస్క్‌ఫోర్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్యాంసుందర్, శ్రీను, అలీ, శ్రీను, దుగ్గొండి హెడ్‌ కానిస్టేబుల్‌ సుధాకర్, చంద్రశేఖర్‌లను సీపీ డాక్టర్‌ రవీందర్‌ అభినందించారు. 

నిందితులు వీరే..
వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తి గ్రామానికి చెందిన జన్ను కోటి, నర్సంపేటకు చెందిన ముదురుకోళ్ల సంతోష్‌ అలియాస్‌ సంతు, ఖానాపూర్‌ మండలం, మనుబోతుల గ్రామానికి చెందిన అబ్బర్ల రాజయ్య, చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన మొగిళి ప్రతాప్‌రెడ్డి, గీసుగొండ మండలం, కొమ్మాలకు చెందిన నిమ్మనికొండ మల్లికార్జున్‌లను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.  

మరిన్ని వార్తలు