నా భార్యను రక్షించండి

28 Nov, 2017 12:26 IST|Sakshi
సమస్యను వివరిస్తున్న రమణయ్య

ఖతర్‌కు అని చెప్పి కువైట్‌ తీసుకెళ్లి రూ.4 లక్షలకు అమ్మేశారు

విడిపించాలని ఉపరాష్ట్రపతి, సీఎం, వైఎస్‌ జగన్‌కు బాధితుడి లేఖలు

నెల్లూరు, గూడూరు: ‘ఖతర్‌ దేశానికని చెప్పి.. కువైట్‌కు తీసుకెళ్లి అక్కడ నా భార్యను రూ.4 లక్షలకు ఏజెంట్లు అమ్మేశారు. అక్కడ డబ్బులు ఇవ్వకుండా తనను నానా హింసలకు గురిచేస్తున్నారని ఆమె నాకు ఫోన్‌ చేసి బోరున విలిపించింది. నా భార్యను ఇండియాకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలి.’ అని గూడూరు పట్టణానికి చెందిన పల్లిపాటి రమణయ్య అనే వ్యక్తి సోమవారం విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వివరాల మేరకు.. పట్టణంలోని పొట్టి శ్రీరాములు పార్క్‌ ప్రాంతానికి చెందిన రమణయ్య, పోలమ్మ భార్యభర్తలు. అందరి లాగే ఇతర దేశాలకు వెళ్లి బాగా సంపాదించాలని వీరు కూడా అనుకున్నారు. ఈ మేరకు.. వైఎస్సార్‌ కడప జిల్లాలోని రైల్వే కోడూరుకు చెందిన గురవయ్య, మస్తాన్‌బాషా, శేషు, అమరావతి అనే ఏజంట్లును ఈ ఏడాది జనవరిలో కలిశారు. తమను ఖాతర్‌ దేశానికి పంపాలని కోరారు.  దీంతో ఏజెం ట్లు రూ.1 లక్ష ఇవ్వాలని చెప్పారు. ఆ దంపతులు తమకున్న ఒకే ఒక ఇంటిని తాకట్టుపెట్టి ఏజంట్లకు నగ దు చెల్లించా రు.

తీరా వారిని పంపే సమయంలో రమణయ్యకు వీసా రాలేదని పోలమ్మకు మాత్రమే వచ్చిందని చెప్పి.. ఆమెను ఖాతర్‌కు కాకుండా కువైట్‌కు పంపేశారు. అలా కువైట్‌కు వెళ్లిన పోలమ్మ నాలుగు నెలలపాటు మాత్రమే కొంత మొత్తం నగదు మాత్రమే తనకు పంపిందని రమణయ్య తెలిపాడు. ఆ తర్వాత భార్య పోలమ్మ తాను పని చేసే యజమాని డబ్బు ఇవ్వడం లేదని, తనను ఏజంట్లు రూ.4 లక్షలకు అమ్మేశారని భోరున విలపిస్తూ ఫోన్‌ చేసిందని వాపోయాడు. రూ.4 లక్షలు తీసుకొస్తేనే తిరిగి పంపుతామని వారు చెబుతున్నారని పోలమ్మ ఆవేదన వ్యక్తం చేసినట్లు రమణయ్య వాపోయాడు. ఉన్న ఒక్క ఇంటినీ తాకట్టు పెట్టిన తాను రూ.4 లక్షలు ఎక్కడి నుంచి తేగలనని వాపోయాడు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు,  సీఎం, వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులకు లేఖలు రాయడంతో పాటు  రైల్వే కోడూరు పోలీసులతోపాటు,  జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని, తనకు న్యాయం చేయాలని రమణయ్య విజ్ఞప్తి చేస్తున్నాడు.  

మరిన్ని వార్తలు