హాజీపూర్‌ హత్యల కేసులో సంచలన తీర్పు

6 Feb, 2020 18:36 IST|Sakshi

సాక్షి, నల్లగొండ: హాజీపూర్‌ హత్యల కేసులో పోక్సో స్పెషల్‌ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హాజీపూర్‌ హత్యలకు సంబంధించిన మూడు కేసుల్లోనూ శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది. ముగ్గురు చిన్నారి బాలికలపై అత్యాచారం జరిపి.. శ్రీనివాస్‌రెడ్డి అత్యంత దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపాయి.

ఈ మూడు హత్యలకు సంబంధించి పోక్సో స్పెషల్‌ కోర్టు వేర్వేరుగా తీర్పులు వెలువరించింది. శ్రావణి, కల్పన కేసులలో హంతకుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధించిన కోర్టు.. మనీషా కేసులో జీవితఖైదు విధించింది. ఎఫ్‌ఐఆర్‌ నంబర్లు 110, 109 కేసుల్లో దోషికి ఉరిశిక్ష పడింది. ముగ్గురు బాలికలను కామాంధుడైన శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించింది. ఈ కేసులో గత నెల 17వ తేదీన వాదనలు ముగిశాయి. ఈ కేసులో క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. బాలికలపై అత్యాచారం, హత్యలకు సంబంధించి కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అదేవిధంగా కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్‌ నివేదికలు కేసులో కీలకంగా నిలిచాయి. హాజీపూర్‌ కేసులో మొత్తం 90 రోజుల్లో దర్యాప్తు పూర్తయింది. గత ఏడాది జూలై 31న నల్లగొండలోని పోక్సో స్పెషల్‌ కోర్టులో పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. గత ఏడాది అక్టోబర్‌ 14 నుంచి ఈ కేసులలో కోర్టు విచారణ ప్రారంభించింది.

యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారం జరిపి అత్యంత కిరాతకంగా హత్య చేసిన సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. హాజీపూర్‌ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హత్యకు గురైన పాములు శ్రావణి కేసు మొదట వెలుగులోకి వచ్చింది. హాజీపూర్‌కు వెళ్లేదారిలోని తెట్టె బావిలో ఆమె శవాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకొని విచారించగా.. మనీషా, కల్పనలను శ్రీనివాస్‌రెడ్డే దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్టు తేలింది. ఈ మూడు కేసులలో వేగంగా దర్యాప్తు చేపట్టిన యాదాద్రి పోలీసులు 90 రోజుల్లో కోర్టుకు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

బాధిత కుటుంబసభ్యుల హర్షం
శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధించడంపై బాధిత బాలికల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగిందని, శ్రీనివాస్‌రెడ్డిని వెంటనే ఉరితీయాలని, శిక్ష అమలులో ఏమాత్రం తాత్సారం చేయవద్దని కోరుతున్నారు.



 

మరిన్ని వార్తలు